వైఎస్సార్ ఆత్మకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

‘వృద్ధ నారీ పతివ్రతః’ అన్న సామెత చందంగా తాను క్రియాశీలంగా రాజకీయాల్లో చక్రం తిప్పినంత కాలమూ సకల అరాచకాలకు కేంద్రబిందువుగా ఉండి, రాజకీయాలు డబ్బు మయంగా, నేరమయంగా మారిపోవడం ఒక కీలక పాత్రగా ఉండిన వ్యక్తి.. క్రియాశీల రాజకీయాలనుంచి పూర్తిగా విరమించుకున్న తరువాత.. రాజకీయాల్లో ఉండే అవ్యవస్థ ధోరణులను కడిగేయడానికి, సంస్కరించడానికి తాను ఉద్యమిస్తానని నీతులు వల్లిస్తే ఎలా ఉంటుంది. చూసేవాళ్లలో కొందరికి కామెడీగాను, కొందరికి కంపరంగానూ కనిపిస్తుంది. ఒకప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి ‘ఆత్మ’గా విస్తృత ప్రాచుర్యంలో ఉన్న, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ తెరవెనుక నుంచి సమస్త రాష్ట్ర వ్యవహారాల్లో తానే చక్రం తిప్పిన కేవీపీ రామచంద్రరావు పరిస్థితి గమనిస్తే ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో పొడసూపుతున్న ధోరణులను సంస్కరించడానికి అనే ఉద్దేశంతో ఆయన సుప్రీం కోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కొట్టివేసింది. తాను అధికార పదవుల్లో ఉన్నంత కాలమూ మిన్నకుండిపోయి.. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయడాన్ని సుప్రీం ధర్మాసనం ఎత్తిచూపింది. వివరాల్లోకి వెళితే..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లను ప్రభావితం చేయడానికి అహేతుకమైన రీతిలో పంచుతున్న నగదు, ఉచిత పథకాల గురించి న్యాయ సమీక్ష చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సుప్రీం కోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిల్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆరేళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు.. ఈ వ్యవహారంపై బిల్లు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా.. ఇప్పుడు పత్రికల్లో హెడ్ లైన్స్ లో కనిపించడం కోసం ఇలాంటి పిటిషన్ వేస్తున్నారా? అంటూ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. కేవీపీ తరఫు న్యాయవాది.. దామా శేషాద్రినాయుడు.. కేవీపీ ఇప్పుడు ప్రజాజీవితంలో లేరని, నిజంగానే సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని విన్నవించినప్పటికీ ధర్మాసనం పట్టించుకోలేదు. ప్రచారం కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించేది లేదని.. పిల్ కొట్టివేసింది.

కేవీపీ రామచంద్రరావు సుదీర్ఘకాలం రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయనదే హవా. రాష్ట్రంలో ఆయన మాట వేదమై సాగింది. కానీ.. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఉచిత పథకాలు, తాయిలాలు అదుపుతప్పి వ్యవస్థను సర్వనాశనం చేసేస్థాయికి చేరుకున్నాయి కూడా. ఆరోజుల్లో కేవీపీ స్వయంగా వాటన్నింటికి రూపకల్పన చేసి వైఎస్ఆర్ కు రాజకీయ లబ్ధి చేకూర్చారు. ఆ తర్వాత.. ఆయన కాంగ్రెసు పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ అయ్యారు. .. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో లేకుండాపోయింది గానీ.. ఇలాంటి విషయంపై నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే.. పార్లమెంటులో ప్రెవేటు బిల్లు పెట్టడం ద్వారా అయినా.. చర్చ జరిగేలా చేసి ఉండవచ్చు. ఆయన ఎంపీగా ఉన్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ఇలాంటి ఉచిత, వ్యవస్థను నాశనంచేసే తాయిలాలను అనేకం ప్రకటించింది. కాకపోతే వారు నెగ్గలేదు. తను ఏమైనా చేయగలిగిన దశలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా.. పూర్తిగా రాజకీయాలనుంచి రిటైరైనతర్వాత కేవీపీ పిల్ పేరుతో కొత్త డ్రామాలు చేస్తున్నట్టుగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఆయనను ప్రజలు పూర్తిగా మరచిపోయారని, సుప్రీం వ్యాఖ్యానించినట్టుగా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవడం కోసమే ఇలా చేస్తున్నట్టు ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories