దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తుతం అమెరికా వెళ్లిపోయారు. అక్కడ ఉంటున్న తన మనవడు (వైఎస్ షర్మిల కొడుకు) వద్దకు వెళ్లినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులకు కుటుంబసభ్యురాలు మాత్రమే కాదు. వైఎస్సార్ మరణం తర్వాత రాజకీయ వారసురాలిగా పులివెందుల ఎమ్మెల్యేగా నెగ్గిన నాయకురాలు కూడా. అంతే కాకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపన నుంచి గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కిందటి వరకు రాజీనామా చేసిన నాయకురాలు. అలాంటి నాయకురాలు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన ఎన్నికల వాతావరణం నెలకొని ఉండగా.. తనకేమీ పట్టనట్టుగా అమెరికాలోని మనవడి వద్దకు వెళ్లిపోవడం ఎవరికైనా సరే ఆశ్చర్యం కలిగించే సంగతే.
అయితే ఇందుకు సంబంధించి రకరకాల కారణాలు వినిపించాయి. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కొడుకు జగన్ ఒత్తిడి చేస్తున్నారని, అది ఇష్టం లేకనే ఆమె అమెరికా వెళ్లిపోయారని వినిపించింది. 2019 ఎన్నికల తర్వాత కొడుకు- కూతురు మధ్య విభేదాలు వచ్చాయి. షర్మిల తెలంగాణలో పార్టీపెట్టుకుంది. విజయమ్మ కొడుకు పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి, ఇక ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని, కూతురు వెంట ఉండాలని ప్రకటించింది. తీరా ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ కే సారథి అయి.. అన్న జగన్ మీద విమర్శలు సంధిస్తోంది. ఇలా అన్నా చెల్లెళ్ల మధ్య పోరులా రాజకీయాలు తయారయ్యాయి. షర్మిల అంటే ఎక్కువ ప్రేమ ఉన్నప్పటికీ, ఆమె తరఫున ప్రచారానికి వెళ్లి కొడుకును తిట్టలేక.. అలాగని ప్రచారానికి రావాల్సిందిగా కొడుకు ఒత్తిడిని తట్టుకోలేక అమెరికా వెళ్లారని వార్తలొచ్చాయి.
అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రం మరో రకం వ్యాఖ్య చేస్తున్నారు. అధికారం కోసం జగన్ కుటుంబసభ్యులను హతమార్చి, తద్వారా ప్రజల సానుభూతి పొందడానికి కూడా వెనుదీయడని అంటున్నారు. గత ఎన్నికలకు ముందు చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేయించి ఆ సానుభూతితో గెలిచారని, ఇప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయోనని ఆయన కుటుంబసభ్యులు భయపడుతున్నారని అన్నారు. ప్రాణభయంతోనే వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్లిపోయినట్లుగా ఆయన చెబుతున్నారు. సీఎం జగన్ కు చంపడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ముందు ఆయన కుటుంబసభ్యులే జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరిస్తున్నారు.
గత ఎన్నికల్లో కోడి కత్తి సానుభూతి మాదిరిగానే, ఈసారి ఎన్నికలకు ముందు గులకరాయి హత్యాయత్నం ఎపిసోడ్ నడిపిస్తున్నారని, గత ఎన్నికల్లో వివేకా హత్య మాదిరిగానే ఈ ఎన్నికల్లో కుటుంబంలోని ఒకరి హత్య జరగవచ్చునని ఆయన అనడం గమనార్హం. చింతమనేని- సీఎం జగన్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.