అమరావతి రాజధాని అద్భుతాలలో ఒకటిగా నిర్మాణం కానున్న సచివాలయ టవర్ల విషయంలో ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అనుసరించబోతోంది. ఈ అయిదు టవర్ల నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్డ్ డిజైన్లు ఒక కొలిక్కి వస్తున్నాయి. లండన్ కు చెందిన ఫోస్టర్స్ సంస్థ ఈ డిజైన్ల ను సిద్ధం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొత్తం అయిదు టవర్లుగా ఇవి నిర్మాణం కానున్నాయి. డయాగ్రిడ్ విధానంలో డిజైన్ చేసిన ఈ అయిదు టవర్లను పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తారు. ఇందుకు అవసరమైన ఫ్యాబ్రికేషన్ వర్క్ షాపులను అమరావతిలోనే ఏర్పాటుచేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ ప్రయత్నం కార్యరూపం దాలిస్తే పనుల నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా.. శరవేగంగా పనులు జరుగుతాయని అంతా అంచనా వేస్తున్నారు.
రాజధానిలో అయిదు ఐకానిక్ టవర్లుగా సచివాలయాన్ని ప్లాన్ చేశారు. మొత్తం 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అయిదు టవర్ల నిర్మాణం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఉండే జీఏడీ టవర్ విషయానికి వస్తే.. బేస్ మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా.. 47 అంతస్తులతో ఈ టవర్ ఉంటుంది. దీని టెర్రస్ మీద హెలిప్యాడ్ కూడా ఏర్పాటుచేస్తారు. మిగిలిన నాలుగు హెచ్ఓడీ టవర్లు 39 అంతస్తులతో ఉంటాయి. ఒక టవర్ నుంచి మరో టవర్ లోకి వెళ్లడానికి మూడో అంతస్తు వద్ద గ్లాస్ బ్రిడ్జిలు ఉండేలా తుది రూపులను సిద్ధం చేస్తున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జి 900 మీటర్ల పొడవు వుంటుంది. ఈ అయిదు టవర్లకు అనుబంధంగా 8 ఎమినిటీస్ బ్లాకులు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా, మూడు అంతస్తులతో ఉంటాయి.
డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం అయ్యే ఈ టవర్లు పూర్తిగా ఫ్యాబ్రికేషన్ తోనే అవుతాయి. ప్రతి టవర్ కు సగటున 15-20 వేల టన్నుల ఉక్కు అవసరం అవుతుందనేది అంచనా. ఈ టవర్ల పనులను మొత్తం మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. భారీ పరిమాణంలో డయాగ్రిడ్ ఆకృతులను ఇతర ప్రాంతాల్లో ఫ్యాబ్రికేట్ చేసి. ఇక్కడకు తరలించాలంటే.. రవాణా ఇబ్బందులతో పాటు చాలా టైం వేస్టవుతుందనే అభిప్రాయం ఉంది. దీనికి విరుగుడుగా పని ప్రదేశంలోనే ఫ్యాబ్రికేషన్ వర్క్ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి పది ఎకరాల స్థలం కేటాయించాలని నిర్మాణ సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. ఫ్యాబ్రికేషన్ కు సంబంధించి మేజర్ వర్క్ మొత్తం వర్క్ సైట్ లోనే జరుగుతుంటుంది కాబట్టి.. టైం వేస్ట్ ఉండదు. ఫలితంగా.. ఐకానిక్ సెక్రటేరియేట్ టవర్ల నిర్మాణం శరవేగంగా జరిగే అవకాశం ఉంది. మూడేళ్ల లక్ష్యం విధించుకుని పనులు చేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం సాధ్యమవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.