‘అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగనే లేదు. లేని స్కామ్ గురించి కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపుల కోసం తమ పార్టీ వారిని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. ప్రభుత్వం అరాచకానికి పాల్పడుతోంది’ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఎన్ని మార్లు రంకెలు వేశారో లెక్కేలేదు. అయితే మూడున్నర వేల కోట్ల రూపాయలు కాజేసిన ఈ కుంభకోణం వెనుక వైయస్ జగన్ నిర్వర్తించిన కీలక భూమిక ఏమిటో ఆయన పాత్ర ఎంత ఉన్నదో ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారం నాడు కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ స్పష్టం చేస్తున్నది,
ఈ దోపిడీ వెనుక జగన్ పాత్ర కీలకంగా ఉన్నదని అనుబంధ చార్జిషీట్ స్పష్టం చేస్తోంది. కొత్త పాలసీ రూపకల్పన దగ్గర నుంచి, మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాజమార్గంగా మార్చుకోవడంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే కీలకం– అని పేర్కొంటున్నది. ఉన్నతాధికారుల సిఫారసులను కూడా పక్కనపెట్టి ముఖ్యమంత్రి తన స్వబుద్ధితో చేసిన నిర్ణయాలు కేవలం దోపిడీకి సహకరించే వారికి పెద్దపీట వేయడానికే అని ఈ చార్జిషీట్ తేలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. కుంభకోణం ఈ స్థాయిలో రూపుదిద్దుకోవడానికి ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త లిక్కర్ పాలసీ ఎంత ముఖ్యమైనదో కొందరు అధికారుల నియామకం కూడా అంతే కీలకమైనది! కొత్త పాలసీకి అనుగుణంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కారు దానికి ఎండిగా, ప్రత్యేక అధికారిగా తాము చెప్పిన మాట వినే అధికారులను మాత్రమే నియమించింది. వారి నియామకం కోసం అడ్డదారులు తొక్కింది. అప్పట్లో ముఖ్యమంత్రి కి ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లం కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి డిప్యూటేషన్ పై తీసుకురావాలని ఆయన సూచించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడించి, ఆ పని సానుకూలం అయ్యేలా చేయించారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రక్షిత నీటి సరఫరా కార్పొరేషన్ ఎండిగా ఆయనను నియమించాలని నిర్దిష్టమైన సిఫారసును పంపడం గమనార్హం. అయితే బేవరేజస్ కార్పొరేషన్ ఎండిగా అప్పటికే నియమించేశామని జగన్ ఒక నోట్ ద్వారా 2019 సెప్టెంబర్ 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కు తెలియజేశారు. ఈ నిర్ణయం పూర్తిగా జగన్ తీసుకున్నారు.
అక్కడి నుంచి ఈ సమస్త దోపిడీ వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలోనే, ఆయన మార్గదర్శనంలోనే, ఆయన సూచనల మేరకే జరిగిన విషయం అందరికీ తెలిసినదే. అలాగే వేరే శాఖలో ఉన్న ఏ3 నిందితుడు డి సత్యప్రసాద్ ను కూడా అజేయ కల్లం సిఫారసు మేరకు బెవరేజస్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ నిర్ణయాలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి పూనికతోనే జరిగిన సంగతి సాక్ష్యాధారాలతో సహా తేటతెల్లం అవుతోంది.
ఏ రకంగా చూసినా మొత్తం మద్యం కుంభకోణం కోసం అవసరమైన నియామకాలు చేపట్టడానికి అడ్డదారులు తొక్కడంలో ముఖ్యమంత్రి పాత్ర స్పష్టమవుతోంది. ఈ విషయాలను రెండో ఛార్జిషీట్ తేలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి ఆత్మీయుల ద్వారానే ధనుంజయ రెడ్డి.. కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే అంతిమలబ్ధిదారులకు వసూళ్ల సొమ్ము అందినట్లుగా కూడా సిట్ చార్జిషీట్లో పేర్కొన్నారు. జగన్ పాత్రను ఇంతవరకు నిర్ధారించిన తర్వాత మరొక చార్జిషీట్లో ఆయనకు ముడుపులు అందిన తీరును మొత్తం విశదీకరిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.