శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..

మంచి మాట ఎవ్వరు చెప్పినా వినాలంటారు పెద్దలు. నాకు తోచింది మాత్రమే చేసుకుంటూ పోతాననే మోనార్క్ పోకడలు లేకుండా.. పెద్దా చిన్నా స్థాయీ భేదాలను ఎంచకుండా మంచి సలహా ఎవ్వరు చెప్పినా సరే.. విని, ఆచరించడానికి పూనుకున్నప్పుడే.. పాలకులు కూడా న్యాయం చేయగలుగుతారు. కానీ చాలా మందికి ఒక హోదా, స్థాయి దక్కిన తర్వాత.. ఇతరులు చెప్పే మాటలు చెవిన వేసుకోవాలంటే అహంకారం అడ్డొస్తుంది. పైగా తమకంటె తక్కువస్థాయి వాళ్లు చెబితే.. ఇంకా చులకనగా చూస్తారు. కానీ ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ తన సహృదయతను చాటుకున్నారు. ఆటోడ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా.. ఒక సాధారణ ఆటో డ్రైవరు మాటల సందర్భంలో తనతో పంచుకున్న ఒక సూచనను, ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయంగా అమలు చేయడానికి ఆయన మాట ఇచ్చారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కాకపోయినప్పటికీ.. మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ.. ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం ద్వారా.. ఏడాదికి ఏకంగా 436 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఆటో డ్రైవర్లకు అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సుప్రయాణం అవకాశం కల్పించిన తర్వాత.. ఆ మేరకు ఆటోడ్రైవర్లకు రాబడి కాస్త తగ్గుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ముందు ప్రకటించిన హామీ కాకపోయినప్పటికీ.. అమలు చేసింది.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా తమ తమ పరిధిలో ఆటో డ్రైవర్లతో కలిసి ప్రయాణిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ సందడి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునామయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురూ విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్.. స్వర్ణలత అనే మహిళా ఆటో డ్రైవరు నడుపుతున్న ఆటోలో ప్రయాణించారు. ఆమె కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. దంపతులిద్దరూ కష్టపడి కుటుంబాన్ని నడుపుకుంటున్న తీరు, కూతురును సీఏ చదివిస్తున్న తీరును తెలుసుకుని అభినందించారు. తన విషయంలో భార్య బ్రాహ్మణి సంపాదిస్తోంటే.. తాను ఖర్చు పెడుతుంటానంటూ జోకులు వేశారు.

కీలకమైన విషయం ఏంటంటే.. ఆటో డ్రైవరు స్వర్ణలత, లోకేష్ కు ఒక సలహా చెప్పారు. పాఠశాలల్లో ప్రతి పీరియడ్ ముగిసిన తర్వాత పిల్లలు నీళ్లు తాగేలా టీచర్లు వారికి పురమాయించేలా చూడాలని ఆమె కోరారు. మనం మంచి ఆరోగ్యంతో ఉండడానికి వీలైనంత ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. విద్యార్థులకు దీనిని అలవాటు చేయించాలని, అందుకు టీచర్లను పురమాయించాలని ఆమె కోరారు. దీనికి లోకేష్ పాజిటివ్ గా స్పందించారు. సలహా చెప్పినది ఒక ఆటో డ్రైవరు కదా అనుకోలేదు. విధాన నిర్ణయంగా అమలు చేస్తామని చెప్పారు. పాఠశాలలో వాటర్ బెల్ ఉండేలా చూస్తానంటూ ఆమెకు మాట ఇచ్చారు. ఈ రకంగా.. ఒక సాధారణ ఆటో డ్రైవరునుంచి వచ్చిన సలహా పట్ల కూడా విద్యాశాఖలో విధాన నిర్ణయంగా అమలు చేయడానికి పూనుకున్న లోకేష్ సహృదయత గురించి.. అందరూ కొనియాడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories