‘అది సినిమా డైలాగ్’ అంటూంటే భ్రష్టు పట్టిపోవడమే!

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాటల్లో విచక్షణ ఉండదు. గతాన్ని గుర్తుంచుకుని, భవిష్యత్తు పర్యవసానాలను అంచనావేసి మాట్లాడగల తెలివి కూడా లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో పదేపదే అంటున్న ఒక మాట వల్ల ఇప్పుడు మరింతగా భ్రష్టుపట్టిపోతున్నారు. జగన్ బుధవారం నాడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ ను తెలుగుదేశం వారు నిలదీసినందుకు, దానిని ఖండించడానికి ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ అది. కానీ.. జగన్ తెలివికి అసలు పాయింటు ఎక్కడో మరుగున పడిపోయింది. ఆయన తన సొంత సోదితో ఆ సమయం మొత్తం హరించారు.

తన రెంటపాళ్ల పర్యటన నుంచి ప్రతిరోజూ వేస్తున్న ప్రసంగాల రికార్డునే మళ్లీ ఇక్కడ కూడా వినిపించారు. అయితే.. ‘రప్పా రప్పా నరుకుతాం’ అంటూ వివాదాస్పద ఫ్లెక్సిల వల్ల రేగిన వివాదంలో వైసీపీ ధోరణుల్ని ఆయన సమర్థించడం అనేది ప్రస్తుతానికి ఆయన పరువును బజారు పాల్జేస్తోంది.
పుష్ప2 సినిమాలోని.. ‘గంగమ్మ జాతరలో యేటను నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం’  అనే డైలాగును ఫ్లెక్సిలుగా ముద్రించి.. జగన్ 2.0 సర్కారు వస్తే తెలుగుదేశం వారిని ఆ విధంగా నరుకుతాం అని అంటూ జగన్ యాత్రలో ఆయన మూకలు అల్లరిచేసిన సంగతి తెలిసిందే. వారిని అరెస్టుచేశారు కూడా.

అయితే ఆరోజునుంచి ఇప్పటిదాకా వైసీపీ నాయకులందరూ కూడా ‘రప్పా రప్పా’ డైలాగుల్ని వల్లెవేస్తూ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే పనిచేస్తున్నారు. హింసను ప్రేరేపించడమే లక్ష్యం అన్నట్టుగా పదేపదే అదే వాడుతున్నారు. మరొకవైపు ఆ మాటలను సమర్థించుకుంటున్నారు. అది సినిమా డైలాగే కదా.. సినిమాలో వాడినప్పుడు మరి బయట వాడితే తప్పేంటి.. ఫ్లెక్సిలు వేస్తే తప్పేంటి అని జగన్ సమర్థించుకుంటున్నారు.
ఈ సమర్థింపు ఆయన అజ్ఞానాన్ని బయటపెడుతున్నది. ఎందుకంటే.. సినిమాలో ఒక మాట అంటే.. దానికి ఒక సీను, ఆ డైలాగు రావడానికి దారి తీసిన పరిస్థితులు అన్నీ కారణం అవుతాయి.

అలాంటప్పుడే ఒక డైలాగును పదునుగా, ఆవేశంగా రాస్తే ఆ సీను పండుతుంది. పుష్ప2 సినిమాలో హీరో అన్న కూతురిని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి, సామూహిక అత్యాచారానికి పాల్పడబోతున్నారనగా.. వారిని హెచ్చరిస్తూ హీరో పలికే డైలాగు అది. మరి జగన్ తాలూకు కిరాయి గూండా మూకలు.. వారికి ఏ అన్యాయం జరిగిందని.. ఏ ఆవేశం పొంగుకొచ్చిందని ఆ డైలాగును ఫ్లెక్సిలుగా ముద్రించాయో జగనే కాస్త వివరించి చెబితే బాగుంటుంది. జగన్ ఇంట్లోని ఏమహిళలకు ఏ అన్యాయం జరిగిందని ఆయన దళాలకు ఆవేశం వచ్చిందో చెప్పాలి. నిజానికి తన సొంత తల్లి, సొంత చెల్లి మీద కూడా అసభ్యపు కారుకూతలను తన అనుచరులతోసోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన దారుణమైన వ్యక్తి జగన్. ఆయన ఇప్పుడు రప్పారప్పా డైలాగుల్ని సమర్థించుకోవడం చూసి.. ఆ పార్టీ లోని నాయకులే కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ తప్పుడు మాటలను సమర్థించుకున్నంత కాలం.. తమ పార్టీ భ్రష్టుపట్టిపోవడమే అని ఆవేదన చెందుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories