సినీ నటుడు అక్కినేని నాగార్జునపై సిపిఐ నాయకుడు నారాయణ పగ పట్టారా? ఆయన అంతు తేల్చడం తన లక్ష్యంగా భావిస్తున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలలో కలుగుతున్నాయి. నాగార్జున కుటుంబం, వారి వైఖరిపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పుట్టిన వివాదం ఇప్పుడు సిపిఐ నారాయణ జోక్యంతో కొత్త మలుపు తీసుకుంటున్నది. అక్కినేని నాగార్జున కోర్టులో వేసిన పరువు నష్టం దావా గురించి, నారాయణ ఎద్దేవా చేయడం జరుగుతున్నది! అక్కినేని అభిమానులను బాధించేలా నారాయణ అంటున్న ఎగతాళి మాటలు అంతకంటే ఎక్కువ సంచలనం అవుతున్నాయి.
తన గురించి సోషల్ మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు, కేటీఆర్ ను విమర్శించడం లక్ష్యంగా పెట్టుకున్న కొండా సురేఖ.. ఆ క్రమంలో సినీ నటుల పేర్లను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా సమంత వైవాహిక జీవితం గురించి, ఆమె పట్ల అనుచితంగా మాట్లాడినట్లు నాగార్జున, నాగచైతన్య గురించి మాట్లాడారు. తమను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని సమంత పోస్టు పెట్టిన తర్వాత.. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. సమంత సైలెంట్ గానే ఉన్నారు గానీ.. నాగార్జున మాత్రం ఈ విషయంలో కొండా సురేఖ అంతు తేల్చాలన్నట్టుగా పరువు నష్టం దావాతో కోర్టుకు వెళ్లారు. కేటీఆర్ కూడా మరో పరువునష్టం దావా వేశారు. సినీ ప్రముఖులు అనేకమంది నాగార్జునకు మద్దతుగా సురేఖపై విమర్శలు చేయడం జరిగింది. వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత.. వివాదం పెంచవద్దని కాంగ్రెస్ నాయకులు చెప్పడం కూడా జరిగింది.
అయితే పరువు నష్టం దావా గురించి తాజాగా మాట్లాడిన సీపీఐ నారాయణ.. పరువు ఉన్నవారు కదా.. పరువు నష్టం దావా వేయాల్సింది అంటూ నాగార్జున గురించి ఎద్దేవా చేయడం గమనార్హం. హైడ్రా కూల్చివేతలు మొదలైన తర్వాత సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు కూడా సిపిఐ నారాయణ తీవ్రంగా స్పందించారు. కూల్చివేతలను సమర్థిచారు. ఇప్పుడు ఆయన కొండా వ్యాఖ్యలపై కోర్టుకెళితే.. హేళన చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపట్ల పరువునష్టం దావా వేయాలనుకుంటే.. ఆ హక్కు సమంతకు మాత్రమే ఉన్నదని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించడం విశేషం. బిగ్ బాస్ షో ద్వారా అన్ పాపులర్ అయిన, పరువు పోగొట్టుకున్న నాగార్జున.. పరువునష్టం దావాతో కోర్టుకు వెళ్లడం అంటే అంత పెద్ద జోక్ మరొకటి లేదు.. అంటూ నారాయణ ఎద్దేవా చేయడం విశేషం.