సారంగపాణి జాతకం తేలేది అప్పుడే!

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న  ‘సారంగపాణి జాతకం’. ఇందులో టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి సరసన తెలుగు నటి రూప కొడుయూర్ హీరోయిన్‌ గా చేస్తోంది. ‘జెంటిల్‌మన్‌’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తరువాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్‌ కాంబోలో రూపొందుతున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. ఈరోజు ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు.

ఈ మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా మా మూవీని విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది.

అతి త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకుతీసుకుని వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని నిర్మాత చెప్పారు. ‘సారంగపాణి జాతకం’ మా సంస్థలో గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు. ప్రియదర్శి పులికొండ, రూప కొడుయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిషోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

‘సారంగపాణి జాతకం’ సినిమా ఇటు ప్రియదర్శికి, అటు డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటికి కీలకమే. ఇంద్రగంటి 2018లో ‘సమ్మోహనం’ సినిమాతో హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇప్పటిదాకా ఆయనకు ఒక్క హిట్ సినిమా పడలేదు. వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు చేశాడు. కానీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అప్పటి నుంచి ఆయన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రియదర్శి రీసెంట్ గా ‘డార్లింగ్’ అనే సినిమాతో థియేటర్లోకి సందడి చేశాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 2023 లో వచ్చిన ‘బలగం’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో కూడా ఏ హిట్‌ పడలేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories