అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో ఏడేళ్ల జైలు శిక్షకు గురై ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితులందరికీ తమకు విధించిన శిక్ష చాలా తప్పుగా కనిపిస్తోంది. తాముచేసిన అక్రమాల గురించి వారు ప్రస్తావించడం లేదు. తమకు శిక్ష విధించిన కోర్టుకు ఉన్న పరిధిని మించి.. సీబీఐ కోర్టు విచారణ సాగించి తమకు శిక్షలు విధించిందని ఆరోపిస్తూ.. సీబీఐ కోర్టు చాలా యాంత్రికమైన విచారణ చేసిందని పేర్కొంటూ ఓబుళాపురం మైనింగ్ కేసులో శిక్ష పడిన నిందితులు బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, గనులశాఖ మాజీ డైరక్టర్ విడి రాజగోపాల్ రెడ్డి, గాలి పిఏ మెఫజ్ ఆలీఖాన్ వేర్వేరుగా బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ కోణంలో సాగించే వాదనలతో వారి కోరిక నెరవేరడం హైకోర్టు ద్వారా బెయిలు దక్కడం కష్టమే అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతకూ గాలి బ్యాచ్ వాదన ఏంటంటే.. సరిహద్దు వివాదాలు, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, బళ్లారి ఐరన్ ఓర్ కంపెనీల అక్రమ మైనింగ్ వ్యవహారాల మీద మాత్రమే సీబీఐ కోర్టు విచారణ జరపాలని సీబీఐకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వారు వాదిస్తున్నారు. సీబీఐ తమ పరిధిని మీరి మైనింగ్ లీజలపై కూడా దర్యాప్తు చేసిందని.. వాటి ఆధారంగా శిక్షలు విధించడం కరెక్టు కాదని వారు అంటున్నారు.
నిపుణులు చెబుతున్న విశ్లేషణ ఏంటంటే.. సీబీఐ కోర్టు తమ పరిధిని మీరి విచారణ చేస్తున్నట్లయితే గనుక.. వారు చెబుతున్న వ్యవహారాలపై సీబీఐ కోర్టు విచారణ చేసిన సమయంలోనే వారి న్యాయవాదులు అభ్యంతరాలు తెలియజేసి ఉండాలి. పట్టించుకోకపోతే తమ అభ్యంతరాలను పట్టించుకోవడం లేదంటూ పైకోర్టును ఆశ్రయించి ఉండాలి. అలాంటి పనేమీ చేయకుండా.. విచారణ మొత్తం పూర్తయి శిక్షలు కూడా పడిన తర్వాత.. అసలు విచారణ జరిగిన తీరే తప్పు అని.. కోర్టు యాంత్రికంగా విచారణ సాగించిందని.. కాబట్టి హైకోర్టులో విచారణ మొత్తం పూర్తయ్యే వరకు తమకు బెయిలు మంజూరు చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.
ఈ కారణాల చేత.. గాలి బ్యాచ్ హైకోర్టుకు చేసుకున్న విన్నపాలు ఫలించడం కష్టం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.