అప్పట్లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే లక్ష్యంగా జగన్ సాక్షి పత్రికను, సాక్షి టీవీని స్థాపించారు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వీటి అవసరం లేకుండానే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ మీడియా సంస్థలు మాత్రం- జగన్ ఏ పనిచేస్తే ఆ పని గురించి డప్పు కొట్టడానికి, ఆయనను నిత్యం కీర్తిస్తూ ఉండడానికి ఉపయోగపడుతూ వచ్చాయి. తాను అధికారంలోకి రావడానికి కూడా ఆ మీడియా సంస్థలను ఆయన సహజంగానే వాడుకున్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉంటే.. సాక్షి టీవీ ఛానెల్ పార్టీ అభ్యర్థులకు గండంగా మారేటట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఆ టీవీలో ప్రచారం వారి పుట్టిముంచేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా చేసిన ప్రకటన చూస్తే అలాగే అనిపిస్తుంది.
సొంత టీవీ ఛానెళ్లను కలిగిఉన్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు ఆ చానెళ్లలో కల్పించే ప్రచారాన్ని వారి ఎన్నికల ఖర్చుకిందే పరిగణిస్తాం అని మీనా ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లో ఇది చాలా కీలక పరిణామం అని చెప్పాలి. ఎన్నికల ఖర్చుల పరంగా వైసీపీ అభ్యర్థులకు ప్రమాదం అని కూడా చెప్పాలి.
నిజానికి జగన్ ఏ సభలో తాను మాట్లాడుతున్నా.. వారిలాగా నాకు సొంత పత్రికల లేవు, సొంత టీవీ ఛానెళ్లు లేవు.. నాకున్నదంతా ప్రజాబలం మాత్రమే అని పచ్చి అబద్ధాలను అలవోకగా చెబుతూ ఉంటారు. ఆయన ప్రజల ఎదుట ఎలాంటి అబద్ధాలైనా చెప్పవచ్చు గానీ.. ఎన్నికల సంఘం నిబంధనల వద్దకు వచ్చేసరికి ఆయన తప్పించుకోలేరు. జగన్ సాక్షి పత్రిక, సాక్షిటీవీ సంస్థల్లో యజమానిగా లేకపోవచ్చు. కానీ ఆయన భార్య భారతి ఒక డైరక్టరు అనే సంగతి అందరికీ తెలుసు. జగన్ ఎన్ని నిందలు వేసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 సంస్థలు తెలుగుదేశం పార్టీకి చెందినవి అని నిరూపించలేరు. అదే సమయంలో సాక్షి టీవీ ఆయనదే అని నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆస్తుల అఫిడవిట్లలోనే అభ్యర్థితో పాటు భార్య ఆస్తుల్ని కూడా ఈసీ పరిగణిస్తుంది. అలాంటప్పుడు భారతి డైరక్టరుగా ఉన్న సాక్షిటీవీ ఛానెల్ ను, జగన్ అధ్యక్షుడుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినదిగా గుర్తించడం జరుగుతుంది. దాంతో సాక్షిటీవీలో వచ్చే అభ్యర్థుల ఇంటర్వ్యూలు వారి అతి ప్రచారం యావత్తూ వారి ఖర్చులోకి వచ్చేస్తాయి.
నిజానికి సాక్షి టీవీ తమ సొంత పార్టీ అభ్యర్థులకు కూడా ఉచితంగా ఏమీ సేవలు అందించదు. వారినుంచి భారీగా డబ్బుతీసుకుని వ్యాపారంచేస్తూనే వారికి ప్రచారం అందిస్తుంది. సాక్షి టీవీ చూసే ప్రతి ఒక్కడూ ఎటుతిరిగీ ఫ్యాను గుర్తుకే ఓటు వేస్తాడు. వారికోసం అదనంగా ఖర్చు పెట్టడం అనవసరం అని తెలిసినా అభ్యర్థులు మొహమాటానికి సాక్షి టీవీకి చదివింపులు ఇచ్చినట్టుగా డబ్బులిచ్చి ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలతో సాక్షిలో వచ్చే ప్రచారం మొత్తం వారి ఖర్చులో చేరుతుంది. దానికంటె ఈనాడు, ఆంద్జజ్యోతిల్లో దక్కే ప్రచారం కాస్త బెటర్ అనే భావన వారికి కలుగుతోంది.