లూప్ లైన్ లోకి సజ్జల రామకృష్ణారెడ్డి!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ఆయనకు ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు హఠాత్తుగా ఎలా అదృశ్యం అయిపోయారు? ఇన్నాళ్లూ విజయవాడ కేంద్రంగానే ఉంటూ గడియకోసారి చంద్రబాబు మీద నిశిత విమర్శలను కురిపిస్తూ రెచ్చిపోతూ వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి హఠాత్తుగా సైలెంట్ అయ్యారు ఎందుకు? సజ్జల సైలెంట్ అయ్యారా లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను పూర్తిగా లూప్ లైన్ లోకి నెట్టారా? అనే సందేహాలు ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లోనే కలుగుతున్నాయి.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సీఎం మాట్లాడాల్సి వచ్చే ప్రతి సందర్భంలోనూ సజ్జల మీడియా ముందుకు వచ్చేవారు. సీఎం దగ్గర నుంచి ప్రజలు వివరణ కోరుకునే సమయంలో ఆ వివరం సజ్జల  నోటి గుండా బయటకు వస్తుండేది. అలాగే అప్పటి ప్రభుత్వ హయాంలో సకల శాఖల మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెచ్చుకున్నారు. మంత్రులు ఎవ్వరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే, అది సజ్జల దృష్టికి వెళ్లి ఆయన ఓకే అన్న తర్వాత మాత్రమే అమలురూపంలోకి వస్తుందనేది బాగా ప్రచారం జరిగింది.

ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది. చాలామంది నాయకులు పార్టీని వదిలి తమ సొంత దారి చూసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ముద్ర లేకపోతే చాలు రాజకీయ జీవితం నిశ్చింతగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజీనామాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా తప్పుపడుతూ ఉండడం విశేషం. ఆయన కారణంగానే తాము పార్టీ వీడుతున్నట్టు చాలామంది చెప్పుకొచ్చారు.

ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా లూప్ లైన్ లోకి వెళ్లిపోయారు. ఆయన ఆధ్వర్యంలో ఒక్క ప్రెస్ మీట్ అయినా జరిగి చాలా కాలం అయింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు మద్దతుగా కాదంబరీ జత్వానిని ముంబై నుంచి పట్టుకువచ్చి పోలీసులు వేధించడంలో సజ్జల పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు రాసిన పత్రికల మీద పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇక అదే ఆఖరు. ఆ తర్వాత విజయవాడ వరదల సంగతి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ పార్టీలోని నెంబర్ 2 కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటిదాకా ఒక మీడియాసమావేశం పెట్టలేదు. ఈ పరిణామాలను గమనిస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ లూప్ లైన్ లో పెట్టారనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. ఆయన మళ్లీ లైమ్ లైట్ లోకి ఎప్పుడు వస్తారో ఏమిటో?

Related Posts

Comments

spot_img

Recent Stories