పాపం.. జగనన్న మీడియా పులి పరారైపోయింది!

రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరగనే కూడదు.. తక్షణం మీడియా మైకుల ముందు వాలిపోయి.. ప్రభుత్వాన్ని ఎడాపెడా తిడుతూ గడిపేసే మీడియా పులులు కొందరుంటారు. జగనన్న కుయుక్తులకు, విషప్రచారాలకు వారు అధికారిక అండదండలు అన్నమాట. తమకు నాలెడ్జి ఉన్న రంగమేనా? కాదా? అనే పట్టింపు వారికి ఉండదు. సంగతి ఏదైనా తక్షణం మీడియా ముందుకొచ్చి.. జగన్ కళ్లలో ఆనందం తాండవించడానికి తగినట్టుగా ఎడాపెడా మాట్లాడేసే విద్యలో వారు ఘనాపాటీలు! అలాంటి వారిలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి.. జగన్  ప్రత్యక్ష సేవలో తరించడానికి తన జీవితం చాలు అనుకుని, గత ఎన్నికల్లో కొడుకును ఎమ్మెల్యేగా పోటాచేయించిన పేర్ని వెంకట్రామయ్య అనే పేర్ని నాని కూడా ఒకరు. వైసీపీకి కీలకమైన ఆ మీడియాపులి ఇప్పుడు పరారీలో ఉన్నారు.

ఆయన గోడౌన్లలో  ప్రభుత్వం నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం ఏకంగా 3700 టన్నులు మాయం అయిన కేసులో.. పేర్ని నాని తాను ఎదుర్కోవల్సి వచ్చే సివిల్, క్రిమినల్ లీగల్ చర్యలకు జడిసి, భార్యతోసహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం నాడు మచిలీపట్నం కోర్టులో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ముందస్తు బెయిలు పిటిషన్ కూడా దాఖలు చేశారు.   నానికి చెందిన గోడౌన్లలో దాదాపు కోటిరూపాయల విలువైన రేషన్ బియ్యం మాయమైన వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటినుంచి ఆయన కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

పేర్ని నానికి చెందిన గోడౌన్లను పౌరసరఫరాల సంస్థకు లీజుకు ఇచ్చారు. ఇక్కడ పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచుతారు. అయితే కాకినాడ పోర్టునుంచి స్మగ్లింగ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. పేర్ని నాని గోడౌన్ల తరఫున ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. తన గోడౌన్లలో 3200 బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించాం అని, దాని విలువ చెబితే చెల్లిస్తానని లేఖ రాశారు. ఆ లేఖ చూసి కంగారు పడ్డ అధికారులు నేరుగా వెళ్లి తనిఖీలు చేస్తే ఏకంగా 3708 బస్తాలు తేడా వచ్చినట్టు గుర్తించారు.
గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్ పై ఇప్పటికే కేసు నమోదై ఉంది. ఆ గోడౌన్లు పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్నాయి. కేసు కారణంగా ఆమె అరెస్టు కూడా తప్పదని వార్తలు రావడంతో.. ఆమె ముందస్తు బెయిలు పిటిషన్ కోసం దరఖాస్తు చేశారు. కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లారు. మొత్తానికి ప్రతి విషయంలోనూ మీడియా ముందుకు వచ్చి జగన్ తరఫు మాటల పులి ఇప్పుడు పరారీలో ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories