అవినాష్ రెడ్డి కి కొత్త ట్రబుల్స్ రానున్నాయా?

వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి ఒక కీలక పరిణామం తాజాగా చోటుచేసుకుంది. ఆయన సొంత కూతురు, అల్లుడు, అలాగే హత్య కేసు దర్యాప్తు చేస్తూ వచ్చిన అప్పటి సిబిఐ అధికారి రామ్‌సింగ్ ల మీద.. స్వయంగా వైయస్ వివేకానం రెడ్డి పి ఏ కృష్ణారెడ్డి పెట్టిన పోలీసు కేసు తప్పుడు కేసుగా తేలిపోయింది. 23 మంది సాక్షులను విచారించిన పిమ్మట ఇది తప్పుడు కేసు అని తేలుస్తూ పులివెందుల పోలీసులు కోర్టులో చిట్టచివరి చార్జి షీట్ దాఖలు చేశారు. దీనితో తనకు వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతున్నదంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. అంటే వివేకా హత్య కేసును ముందుకు తీసుకువెళ్లడంలో తెరవెనుక కీలక సూత్రధారి గా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
విషయం ఏంటంటే.. సిబిఐ దర్యాప్తు మొదలైన తరువాత అవినాష్ రెడ్డి చుట్టూ కేసు బిగుసుకుంటున్న వాతావరణం చాలా స్పష్టంగా కనిపించింది. వివేకా మరణాన్ని తొలుత గుండెపోటుగా ప్రచారం చేయడం, రక్తపు మరకలను కడిగేయించి సాక్షాలను మాయం చేసేందుకు కుట్ర పన్నడం ఇవన్నీ స్వయంగా అవినాష్ రెడ్డి సారధ్యంలోనే జరిగినట్లుగా తేటతెల్లం అయింది. అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని అందరూ భావిస్తున్న వేళ ఆ వర్గం నుంచి ఒక కొత్త ఎత్తుగడ వేశారు.

వైయస్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ద్వారా అప్పట్లో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య వెనుక కొందరు నాయకుల పాత్ర ఉన్నట్లుగా సాక్ష్యం చెప్పాలని సిబిఐ అధికారులు ప్రధానంగా ఎస్పి రామ్ సింగ్ తనమీద ఒత్తిడి తెస్తున్నారంటూ ఆపిటిషన్లో వివేకా పీయే కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సిబిఐ అధికారులకు అనుగుణంగా ఉండి వారు చెప్పినట్టు చేయాలని వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా తనమీద ఒత్తిడి తెస్తున్నట్లు గా ఆయన ఆరోపించారు. అంటే అవినాష్ రెడ్డిని కేసులో కీలక సూత్రధారిగా ఫ్రేమ్ చేయడానికి సిబిఐ స్వయంగా కుట్ర పన్నుతున్నదని అర్థం వచ్చేలా ఈ పిటిషన్ సాగింది. పులివెందుల కోర్టు  ఆదేశాల మేరకు పోలీసులు ఈ ముగ్గురి మీద కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఆ కేసు విచారణలో నలుగుతూనే ఉంది.

తాజాగా 23 మంది సాక్షులను విచారించిన పిమ్మట అది పూర్తిగా తప్పుడు కేసు ని తేలినట్లు పులివెందుల పోలీసులు కోర్టుకు నివేదించారు. పులివెందుల న్యాయమూర్తి సెలవులో ఉండడంతో జమ్మలమడుగు కోర్టులో వారు ఈ మేరకు తమ చివరి ఛార్జ్ షీట్ నమోదు చేశారు. తనకు వ్యతిరేకంగా సిబిఐ కుట్ర చేస్తున్నదని అవినాష్ రెడ్డి అడ్వాంటేజీ తీసుకోగలిగిన కేసు ఈరకంగా వీగిపోయింది. దీని పర్యవసానంగా అవినాష్ రెడ్డికి కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే బెయిలు మీద బయట ఉన్న సంగతి అందరికీ  తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories