మెంటల్ ఆస్పత్రిగా రుషికొండ ప్యాలెస్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ల పదవీకాలంలో ఈ రాష్ట్రంలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఇటుకపేర్చి నిర్మాణం చేపట్టారా? అనంటే.. దొరికే సమాధానం.. రుషికొండ ప్యాలెస్ ఒక్కటే. తాను నివాసం ఉండడానికి, తన క్యాంపు ఆఫీసు నిర్వహించుకోవడానికి, అలాగే తన కూతుళ్లు ఇద్దరూ నివాసం ఉండడానికి అనువుగా భవనాలను ప్లాన్ చేయించి నిర్మించిన జగన్మోహన్ రెడ్డి.. కనీసం ఆ భవనాల్లో ఒక్కరోజైనా బసచేసే ప్రాప్తం లేకుండానే అధికారంలోంచి దిగిపోయారు. పర్యావరణ అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా.. రుషికొండకు గుండుకొట్టేసి.. తననివాసం కోసం ప్యాలెస్ లు కట్టించుకున్నందుకు జగన్ మోహన్ రెడ్డి వైఖరిని ప్రజలు ఛీత్కరించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిర్మాణం కూడా చేయకపోయినా, అమరావతిని మొత్తం స్మశానంగా మార్చేసినా.. ఈ భవనాలను మాత్రం తన హాయంలో పూర్తిచేసిన జగన్, అందుకోసం 500 కోట్ల రూపాయలకు పైగా తగలేసి.. అత్యంత విలాసవంతంగా కట్టించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆ భవనాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలా? అనే మధనంలో ఇప్పటికీ తేల్చుకోలేకపోతోంది. కాగా, తాజాగా రుషికొండ భవనాలను ఎలా వాడుకోవాలనే విషయంలో ఒక ప్రతిపాదన వస్తోంది.

రుషికొండలోని భవనాలను మెంటల్ ఆస్పత్రికి వినియోగించాలని.. మాజీ ఐపీఎస్ అధికారి, గతంలో జగన్మోహన్ రెడ్డినుంచి అమితంగా వేధింపులు ఎదుర్కొన్న ఏబీ వెంకటేశ్వరరావు సూచిస్తున్నారు. మెంటల్ ఆస్పత్రి కోసం కాకపోతే.. ఐటీ కంపెనీలకోసం ఆ భవనాలను వినియోగించాలని ఆయన సూచిస్తున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలోని అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

రాయలసీమలోని నీటి ప్రాజెక్టులకోసం 10-15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పది లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయని ఆయన సూచిస్తున్నారు. వేలకోట్ల సంపద ఉత్పత్తి అవుతుందని కూడా అంటున్నారు. జగన్ గతంలో రుషికొండ ప్యాలెస్ ల కోసం 500 కోట్లు, రాయలసీమ ఎత్తిపోతలకు 750 కోట్లు ప్రజాధనం వృథా చేశారని ఏబీవీ ఆరోపిస్తున్నారు.

మొత్తానికి రుషికొండ ప్యాలెస్ లను ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనే విషయంలో కూటమి ప్రభుత్వం రకరకాల కసరత్తులు చేస్తూ వస్తోంది. గతంలో కేబినెట్ సహచరులను, ప్రజలను కూడా.. వీటిని వినియోగించుకోవడం గురించి సలహాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు కోరారు కూడా. అయితే.. దానిని ఫైవ్ స్టార్ హోటళ్లకు లీజుకివ్వడం లేదా, విక్రయించడం చేయాలని, పీపీపీ పద్ధతిలో అప్పగించాలని, లేదా, డెస్టినేషన్ వెడ్డింగుల కేంద్రంగా మార్చాలని రకరకాల ఆలోచనలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు ఆ ప్యాలెస్ భవనాలను మెంటల్ ఆస్పత్రిగా మార్చాలని అనడం చిత్రంగా ధ్వనిస్తున్నప్పటికీ.. ఐటీ ఆఫీసులకు కేటాయించవచ్చుననే ప్రతిపాదన పరిగణించదగినదే అనే ఆలోచన పలువురిలో వ్యక్తమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories