జగన్మోహన్ రెడ్డి తన నిరంకుశ పాలన సాగించిన రోజుల్లో.. తాను కక్ష కట్టిన వ్యక్తులను రకరకాల రీతుల్లో వేధించారనే సంగతి అందరికీ తెలుసు. రాజద్రోహం నేరం కింద తన సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజును సీఐడీ పోలీసులతో అరెస్టు చేయించి.. అత్యంత తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వచ్చాయి. కస్టోడియల్ విచారణలో తనను హత్య చేయడానికి ప్రయత్నించారంటూ రఘురామ కొన్ని నెలల కిందట పెట్టిన పోలీసు కేసు ఇప్పుడు విచారణ నడుస్తోంది. అదలాఉండగా.. రఘురామ మాత్రం.. తనను టార్గెట్ చేసిన జగన్ కు నిరంతరాయంగా నిద్రలేని రాత్రులను ప్రసాదించడానికి డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ కేసులో జగన్ ను కూడా సీఐడీ పోలీసులు విచారించేదాకా ఊరుకోరేమోనని ఆయన ప్రవర్తన చెబుతోంది.
రఘురామక్రిష్ణ రాజు సీఐడీ కస్టడీలో ఉండగా ఆయన గుండెల మీద ఎక్కి కూచుని.. ఆయనను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని గుర్తించడానికి ఏర్పాటుచేసిన నిందితుల పెరేడ్ కు రఘురామ జడ్జి సమక్షంలో హాజరయ్యారు. నిందితుడిని గుర్తించారు. తన గుండెల మీద కూర్చుని కొడుతున్న సమయంలో.. అతని మొహానికి ఉన్న ముసుగు ఊడిపోయిందని, అందువల్ల నిందితుడిని స్పష్టంగా చూశానని కూడా చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు తనమీద హత్యాయత్నం కేసులో అసలు నిందితులు ఏ1 సునీల్ కుమార్, ఏ2 పీఎస్సార్ ఆంజనేయులు లను ఎందుకు విచారించడం లేదు అంటూ రఘురామ నిలదీస్తున్నారు.
ఆయన పెట్టిన కేసులో వారిద్దరూ ప్రధాన నిందితులు! ఏ3 గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు. ఏ4 విజయపాల్ కాగా, ఏ5 జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పేరు పెట్టారు. ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరొకవైపు బెయిలుకోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ సంగతులన్నీ ఎలా ఉన్నప్పటికీ.. అసలు ఏ1, ఏ2 లను ఇప్పటిదాకా ఎందుకు విచారించడం లేదు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను విచారించడానికి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు.. అని రఘురామ బహిరంగంగా మీడియా ఎదుట ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఏ1 సునీల్ కుమార్, ఏ2 ఆంజనేయులు మాత్రమే కాదు, ఏ3 జగన్మోహన్ రెడ్డిని కూడా సీఐడీ ఇప్పటిదాకా విచారణకు పిలవలేదు. ఏ4 విజయపాల్ ను విచారించి.. ప్రస్తుతానికి రిమాండులో ఉంచారు. మరికొందరిని విచారిస్తున్నారు. జగన్ పేరు రఘురామ ప్రస్తుతం ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆయన మాటలు సీఐడీ పోలీసుల మీద ఒత్తిడి పెంచుతాయని అనుకోవచ్చు. ప్రస్తుతం జగన్ లండన్ లో ఉన్నప్పటికీ.. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే.. ఏ క్షణాన సీఐడీ పోలీసులు పిలుస్తారో.. విచారణ టేబుల్ ముందు కూర్చోబెడతారో అనే భయంతో బతకాల్సిన పరిస్థితి రఘురామ కల్పిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.