విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో తన తాజా సినిమా ‘కింగ్డమ్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కొత్తగా ఉండటంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది.
ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ బాలీవుడ్ నుంచి ఓ భారీ అవకాశం వచ్చినా దాన్ని మాత్రం తీసుకోలేదన్న వార్తలు బీ టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌లో రూపొందనున్న డాన్ సిరీస్‌లో మూడో భాగమైన ‘డాన్ 3’ సినిమాలో విజయ్‌ను విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమాకు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనుండగా, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
కానీ ఈ సినిమాలో నటించాలన్న ఆఫర్‌కు విజయ్ పెద్దగా ఆసక్తి చూపలేదట. ప్రస్తుతం తెలుగు సినిమాల మీదే తన దృష్టి పెట్టాలని భావిస్తున్న విజయ్, ఇతర భాషల ప్రాజెక్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో ‘డాన్ 3’ చిత్రబృందం మరో నటుడిని ఈ పాత్ర కోసం పరిశీలిస్తోందట.
అయితే ఈ హై ప్రొఫైల్ ప్రాజెక్ట్ జనవరి 2026 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవైపు విజయ్ తన తెలుగు సినిమాపై దృష్టి పెట్టగా, మరోవైపు బాలీవుడ్‌లో వచ్చే అవకాశాల్ని బాగా గమనిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.