వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నగరి తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డిల మధ్య నగరి నియోజకవర్గాల్లో హాట్ హాట్ సవాళ్లు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా.. ఆర్కే రోజా చాలా తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉండేవారు. నిత్యం చంద్రబాబునాయుడును, లోకేష్ ను తిట్టడానికి, పవన్ కల్యాణ్ ను ఎద్దేవా చేయడానికి ఆమె తన సమయాన్ని కేటాయిస్తూ ఉండేవారు. విధిగా ప్రతినెలా తిరుమలేశుని దర్శనాలకు వెళుతూ.. దర్శనానంతరం బయటకు వచ్చిన తర్వాత.. జగన్ పాలన రాష్ట్రానికి మేలు చేయాలని దేవుడిని కోరుకుంటున్నట్టుగా ప్రతినెలా చెబుతుండేవాళ్లు. అలాంటి రోజా ఇప్పుడు దాదాపుగా ఖాళీ అయిపోయారు. తాడేపల్లి నుంచి స్క్రిప్టులు వచ్చినప్పుడు తప్ప మీడియా ముందుకు రావడం లేదు. అదే సమయంలో నగరిలో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అక్కడ అప్పుడప్పుడూ గొడవ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రెడ్డి మీద రోజా నిందలు వేయడం, వాటికి ఆయన ప్రతిస్పందించడం ఇప్పుడు నియోజకవర్గంలోనే హాట్ టాపిక్ గా మారుతోంది.
నగరి మీదుగా పొరుగు రాష్ట్రంలోనికి ఎమ్మెల్యే సహాయంతో విచ్చలవిడిగా స్మగ్లింగ్, అక్రమ రవాణా జరుగుతున్నదనేది రోజా ఆరోపణ. నగరి నియోజకవర్గం రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం గనుక.. అక్కడ ఇలాంటి ఆరోపణలు నిత్యం వస్తూనే ఉంటాయి. జగన్ జమానాలో ఇసుక ముసుగులో భారీ రేట్లకు ప్రజలను దోచుకున్న తరహాలో కాకుండా.. ఇప్పుడు ప్రజలకు ఇసుక పూర్తి ఉచితంగా అందుతూ ఉండడంతో.. నగరి మీదుగా ఇసుక లారీలు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయని ఒకవేళ రోజా ఆరోపించినా కూడా.. దాని గురించి ఆలోచించవచ్చు. అలా జరిగే అవకాశం ఉన్నదని అనుకోవచ్చు. కానీ.. రోజా ఇంకా అనేక రకాల అక్రమ రవాణాలను తన ఆరోపణల్లో కలిపేస్తున్నారు. నగరి మీదుగా లిక్కర్ అక్రమరవాణాలు కూడా జరుగుతున్నట్టు చెబుతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు కంటె ఏపీలో లిక్కర్ ధరలు తక్కువగా ఏం లేవు. అలాంటప్పుడు అక్రమరవాణాకు చాన్సే లేదని ప్రజలు అనకుంటున్నారు. అందుకే ఆమె ఆరోపణలు గాలికి తేలిపోతున్నాయి.
అయితే ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి మాత్రం సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఆయన రోజాకు ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ఆర్కే రోజా కుటుంబానికి ఇసుక స్మగ్లింగ్ లో కోట్లు కాజేయడం గతంలో అలవాటు అయిపోయిందని, ఇప్పుడు తమ ఆర్జన కోల్పోయేసరికి అందుకే తన మీద కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. రోజాకు ధైర్యముంటే ఆమె ఎమ్మెల్యేగా ఉండగా ఇసుక అక్రమ రవాణాతో ఆమెకు గానీ, ఆమె భర్తకు, ఆమె సోదరులకు గానీ ఎలాంటి సంబంధం లేదని.. కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని గాలి డిమాండ్ చేస్తున్నారు. అలాగే తాను కూడా తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సవాలు విసురుతున్నారు. నిజం చెప్పాలంటే గతంలో ప్రతినెలా తిరుమలకు వెళ్లే రోజాకు దేవుడి పట్ల విశ్వాసం ఉన్నదనే అనుకోవాలి. అందుకే .. ఆమె తాను చేసిన ఆరోపణలను నమ్ముతోంటే.. తనకుటుంబానికి గతంలో ఇసుక స్మగ్లింగ్ తో సంబంధం లేదని కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని నియోజకవర్గ ప్రజలు చెవులు కొరక్కుంటున్నారు.