రోజా మనస్తాపం: ‘నేను ఆ మాత్రం పనికిరానా’

జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో కాకాని గోవర్దన రెడ్డితో పాటు ప్రసన్న కుమార్ రెడ్డిని కలిసే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టు అయి కాకాణి జైల్లో ఉండగా, ప్రశాంతి రెడ్డిని బూతులు తిట్టేసి, ప్రసన్న కుమార్ చల్లగా ఇంట్లో కూర్చుని ఉన్నారు. అయితే ప్రశాంతి రెడ్డిపై వ్యాఖ్యలను ఖండించాల్సింది బదులుగా తిట్టిన ప్రసన్నకుమార్ రెడ్డినే ఇంటికి వెళ్లి కలవాలని జగన్ అనుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అదొకవైపు అయితే.. తిట్టిన వాడి ఇంటికే జగన్ పరామర్శకు వెళుతుండగా.. తిట్టించుకున్న తనను పరామర్శించడానికి మాత్రం జగన్ రాదలచుకోలేదని నగరి ఎమ్మెల్యే ఆవేదన చెందుతున్నట్టుగా సమాచారం.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నగరికి వచ్చి అక్కడ ధర్నా చేయాలని.. తనను దూషించిన గాలి భానుప్రకాష్ రెడ్డి అరెస్టుకోరుతూ ఉద్యమించాలని ఆర్కే రోజా కోరుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు చేస్తేనే వాటి తీవ్రత రాష్ట్రమంతా తెలుస్తుందని, ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఆమె అనుకుంటున్నారు. అయితే వైఎస్ జగన్ మాత్రం.. ట్వీట్ లో చేసిన ఖండన, ట్వీట్ ద్వారా పరామర్శ తప్ప నేరులో నగరికి వెళ్లి ఏదైనా చేయడానికి సుముఖంగా లేరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారని.. ఈ అంశం కోసం నగరికి వచ్చి ఏదైనా కార్యక్రమం చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని.. పార్టీ పెద్దలు చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజా అభ్యర్థిస్తున్నా కూడా.. జగన్ నగరిలో కార్యక్రమం ప్లాన్ చేసుకోకపోవడానికి అసలు కారణం వేరే ఉన్నదని పలువురు పేర్కొంటున్నారు.

కొన్ని వారాల కిందటే జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పరిధిలోకే వచ్చే బంగారుపాళ్యంలో మామిడిరైతుల పరామర్శ పేరిట ఒక డ్రామా నడిపించారు. పోలీసుల అనుమతులను ధిక్కరించి చాలా పెద్ద సంఖ్యలో జనాన్ని పోగేయాలని ఆ సందర్భంలో జిల్లాలోని అందరు పార్టీ నాయకులను ఆదేశించారు. కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలనుంచి మాత్రమే కాకుండా, ఇరుగుపొరుగు కడప, నెల్లూరు జిల్లాలనుంచి కూడా నాయకులు కిరాయి కార్యకర్తలను తరలించడం జరిగింది. వారందరికీ డబ్బులు ఇచ్చి, బిర్యానీలు లిక్కరు అందించి.. ట్రాన్స్ పోర్టు ఏర్పాటు చేసి.. జగన్ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి.. ఆయనకు జై కొట్టించడానికి ‘సీఎం సీఎం’ నినాదాలు చేయించడానికి వైసీపీ నాయకులకు నరాలు తెగాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత..  ఆర్థికంగా దారుణంగా దెబ్బతిని ఉన్న పార్టీ నాయకులు ఎన్నో కష్టనష్టాలకోర్చి తాడేపల్లి ప్యాలెస్ పురమాయింపుల మేరకు డబ్బు పోగేసి జనాన్ని తరలించారు.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి.. రోజాకు పరామర్శ పేరుతో మళ్లీ నగరికి వస్తే గనుక.. జనాన్ని పోగేయడం తమ వల్ల కాదని జిల్లాలోని నాయకులందరూ చేతులెత్తేసినట్టుగా తెలుస్తోంది.
జనం లేకుండా నగరికి వెళ్లి కార్యక్రమం నిర్వహిస్తే.. పరువు పోతుంది. జగన్ ఎక్కడ అడుగు పెట్టినా వేల మంది క్షణాల్లో పోగవుతుంటారని చెప్పుకునే అబద్ధాలు తుస్సుమంటాయి. జనాన్ని తరలించి కార్యక్రమం నిర్వహించాలంటే.. జిల్లాలోని ఏ ఒక్క నాయకుడు కూడా సహకరించి.. జనాన్ని తోలించే పరిస్థితిలో లేరు. ఇలాంటి కాంబినేషన్లు అన్నీ లెక్కలు వేసుకుని.. వైఎస్ జగన్ నగరికి వెళ్లడానికి కుదరదని పార్టీ వర్గాలు డిసైడ్ చేసినట్టుగా తెలుస్తోంది.”

ఈ నేపథ్యంలో నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి బాధితుడు కాదు నిందితుడు.. అయినా ఆయన ఇంటికి వెళ్లి జగన్ పరామర్శిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో తాను బాధితురాలిని.. ఒంటరిగా పోరాడుతున్నా తనను పార్టీ పరంగా పట్టించుకునే దిక్కులేదని, ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇచ్చి ఊరుకుంటున్నారని రోజా బాధపడుతున్నారట. జగన్ నగరికి కూడా వచ్చి తన నిరసన తెలియజేస్తే తనకు మర్యాదగా ఉంటుందని ఆమె సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories