రోజా.. ముందస్తు బెయిలుకోసం వెళతారా?

జగనన్న కళ్లలో ఆనందం చూడడం కోసం ఎదుటివారు ఎంతటివారైనా సరే.. కన్నూమిన్నూ కానకుండా వెకిలి తిట్లతో వారిని దూషించడం, జగనన్న భక్తులను అలరించడం అనేది మాజీ మంత్రి రోజాకు అలవాటే! జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. తొలుత మంత్రి పదవికోసం ఆమె చాలా ఆరాటపడ్డారు. విస్తరణలో చాన్సు దక్కిన తర్వాత.. దాన్ని నిలబెట్టుకోవడం కోసం నానా కష్టాలు పడ్డారు. చివరికి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశమైనా దక్కుతుందో లేదో అనే భయాలమధ్య గడుపుతూ మొత్తానికి బరిలోకి దిగి, ఓడిపోయి, ఇప్పుడు ఇంటికి పరిమితం అయ్యారు. తన అస్తిత్వం ప్రదర్శించుకోవడానికి అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబును, పవన్, లోకేష్ లను నాలుగు తిట్లు తిట్టి మళ్లీ అంతర్ధానం అయిపోతుంటారు. అలాంటి రోజా ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నారు.

గత ప్రభుత్వ కాలంలో.. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నిర్వహించిన క్రీడోత్సవాల వ్యయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆ కేసుల విచారణలో ఆమె త్వరలోనే అరెస్టు కాబోతున్నారని ప్రస్తుత శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిరుపేద క్రీడాకారుల కోసం దక్కవలసిన దాదాపు 119 కోట్ల రూపాయలను రోజా కాజేసి నగలు, ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికే విచారణ మొదలైందని, ఓడిపోయిన తర్వాత.. చైన్నైలో విలాసవంత జీవితం గడుపుతున్న రోజా కటకటాల వెనక్కు వెళ్లక తప్పదని ఆయన అంటున్నారు. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అన్ని రకాల అవినీతి బాగోతాలను ఒక్కటొక్కటిగా వెలుగులోకి తెస్తున్న కూటమి సర్కారు..  క్రీడాపోటీల నిర్వహణ ముసుగులో రోజా స్వాహాపర్వాన్ని కూడా బయటపెట్టబోతున్నట్టు అర్థమవుతోంది. శాప్ ఛైర్మన్ రవినాయుడు చెబుతున్న దాన్ని బట్టి త్వరలోనే అరెస్టులు కూడా ఉంటాయి.

అయితే మాజీ మంత్రి ఆర్కే రోజా.. అసలు ఎలాంటి అవినీతి జరగనేలేదని డాంబికంగా అంటున్నారు గానీ.. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలుకోసం హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టుగా సమాచారం. జగన్ హయాంలో అతిపెద్దదైన లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తన పేరు నిందితుల జాబితాలో లేకపోయినప్పటికీ.. అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి భంగపడ్డారు. నిజానికి వైసీపీ నాయకులు.. తమ పేర్లు ఏ కేసుల్లో వినిపించినా సరే.. ముందుగానే బెయిలుకోసం వెళ్లిపోతున్నారు. అదే బాటలో రోజా కూడా, తన మీద పోలీసులు ఇంకా చర్యలకు ఉపక్రమించకపోయినా, నోటీసులేమీ రాకపోయినా.. ముందు జాగ్రత్త చర్యగా బెయిలుకోసం వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ నాయకులు అందరిలోనూ గత ప్రభుత్వం కాలంలో చేసిన పాపాల పట్ల అరెస్టుభయం తాండవిస్తున్నట్టుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories