విసుగు ఓటు’తో రోజాకు పొంచిఉన్న ప్రమాదం!

సాధారణంగా ఎన్నికల్లో సానుభూతి ఓటు, సెంటిమెంటు ఓటు అంటూ రకరకాల ఓట్లు ఉంటాయి. అలాంటి వాటిలో ఒక రకం.. ‘విసుగు ఓటు’! ఒకే అభ్యర్థిని ఒకటికంటె ఎక్కువసార్లు గెలిపించిన తరువాత.. ఎంతకాలమూ అదేమొహం చూస్తూ ఉండాలా? అనే అభిప్రాయం ఓటర్లలో కలుగుతుంది. ‘పండగ పూట  కూడా పాత మొగుడేనా అనే సామెత మాదిరిగా అన్నమాట! ఒకసారి వేరే వారికి చాన్స్ ఇద్దాం అనే అభిప్రాయమూ ప్రజల్లో కలుగుతుంది. పెద్దగా వ్యతిరేకత ఉండదు.. అలాగని అదే సిటింగ్ ప్రజాప్రతినిధిని మళ్లీ గెలిపించాలనే కోరిక కూడా ఉండదు. అలాంటి దాని పేరే విసుగుఓటు. అలాంటి విసుగుఓటు దెబ్బ ఇప్పుడు నగరి నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీచేస్తున్న మంత్రి రోజాకు పడేలా కనిపిస్తోంది.

నిజానికి ఒకటికంటె ఎక్కువ సార్లు ఒకే స్థానం నుంచి గెలిచిన అభ్యర్థులు అదే నియోజకవర్గంలో ఎప్పటికీ తిరుగులేని నాయకులుగా పాతుకు పోయే అవకాశాలు చాలా ఎక్కువ. మనకు అలాంటి దృష్టాంతాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా రెండుసార్లయినా గెలిచిన నాయకులు ఆ నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతమైన ప్రజా సంబంధాలను కలిగిఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అలాకాకుండా.. గెలిచిన తర్వాత.. గెస్టులాగా నియోజకవర్గానికి వచ్చిపోతూ.. అధికారిక కార్యక్రమాల్లో తప్ప ప్రజలకు కనపడకుండా తిరుగుతూ ఉంటే అంత బలమైన నేతగా పాతుకుపోవడం జరగదు. అలాంటప్పుడు ‘విసుగు ఓటు’ అనేది మొదలవుతుంది.

ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. 2014 లో గెలిచారు గానీ.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడంతో ఇక చేసేదేమీ లేదన్నట్టుగా నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్ గా ఉండకుండా మిన్నకున్నారు. అయినా సరే.. ప్రజలు 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిపించారు. జగన్ సర్కారు ఏర్పడిన నాటినుంచి ఆమె మంత్రి పదవిని ఆశిస్తూ వచ్చారు. దానికి తోడు నియోజకవర్గంలో ముఠా రాజకీయాలు నడపడం ప్రారంభించారు. ఆమె వ్యతిరేక వర్గం ఆమెకంటె బలమైన వర్గంగా పార్టీలో ముద్రపడింది. రోజా వ్యతిరేక వర్గానికి జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు ఉండడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేకు విలువ ఇవ్వకుండా ఆమె వ్యతిరేక వర్గం నడిపిస్తూ వచ్చిందంటే ఆమె పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ప్రజలతో పూర్తిస్థాయిలో మమేకం కాలేదు. మంత్రి పదవి దక్కిన తర్వాత కూడా అసమ్మతి మాత్రం సద్దుమణగ లేదు.

ఇప్పుడు ఎన్నికల సమయంలో  అసమ్మతి నాయకులు ఆమెకు చేయగల కీడు ఎంత అనేది ఒక భాగమైతే.. ఆమె ఓడిపోతే గనుక.. ప్రజల్లోని విసుగు ఓటు కూడా ఒక కారణం అవుతుందని అంతా అంటున్నారు. గాలి ముద్దుకృష్ణమ కొడుకు గాలి భానుప్రకాష్ రెడ్డికి ఒక్క చాన్స్ ఇచ్చి చూద్దాం అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories