దోచుకో.. దాచుకో..’ నినాదం ఒకసారి పలకరాదా జగన్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నంతకాలమూ.. ప్రజలతో మమేకం కాకపోయినప్పటికీ.. బటన్లు నొక్కడం అనే మిషమీద అప్పుడప్పుడూ ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు.  స్థానికంగా ఉండే ఊర్ల పేర్లు, స్థానిక నాయకుల పేర్లు తప్ప ఆయన ప్రసంగం స్క్రిప్టులో ఎప్పుడూ ఒకటే కంటెంట్ ఉండేది. అందులో తన సొంత డబ్బాతో పాటు చంద్రబాబు మీద పుంఖానుపుంఖాలుగా నిందలుండేవి. వాటిలో ఒక మాటను జగన్ తన జీవితానికి అతిగొప్ప నినాదంలాగా పదేపదే వాడుతుండేవారు. ఆయనకు మైకు దొరికిన ప్రతిసారీ.. ‘‘చంద్రబాబునాయుడు పరిపాలనలో అయిదేళ్లపాటు ‘దోచుకో దాచుకో’ అనేదే విధానం’’ అని నాటకీయంగా చేతులు ఊపుతూ.. పదేపదే సినిమా ఫక్కీలో డైలాగును వల్లెవేసేవారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకసారి ప్రజల ఎదుటకు వచ్చి ‘‘దోచుకో దాచుకో’’ అనే డైలాగును వల్లించాలని ప్రజలు కోరుకుంటున్నారు. లిక్కర్ కుంభకోణంలో ఒక్కొక్క వాస్తవం వెలుగులోకి వస్తుండగా.. జగన్ కు అత్యంత సన్నిహితులు ఒక్కొక్కరుగా అరెస్టు అవుతుండగా.. దోచుకోవడం అంటే ఏమిటో.. దాచుకోవడం అనగా ఏవిధంగానో.. రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవుతోంది. అందుకే జనం ఇప్పుడు జగన్ నోటినుంచి ఆ నినాదాన్ని మరోసారి వినాలనుకుంటున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మీడియా ముందుకు వస్తే చాలు.. తాము చెప్పదలచుకున్న కంటెంట్ ను చెప్పడంలో ఏకపాత్రాభినయం చేసే మహానటులు చాలామంది ఉన్నారు. ప్రత్యేకించి అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి లాంటి నాయకులు కూడా.. అచ్చంగా ఏకపాత్రాభినయం నటిస్తున్న స్థాయిలో హావభావవిన్యాసాలతో.. ఒక్కొక్క డైలాగును నాటకీయ పద్ధతుల్లో వల్లెవేస్తూ ప్రెస్ మీట్ లను రక్తి కట్టిస్తుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు భిన్నం ఎంతమాత్రమూ కాదు. ఆయన కూడా అదే తరహాలో.. నాటకీయంగా మాటలు వల్లిస్తుంటారు. కాకపోతే చంద్రబాబు మీద నిందలకే ఎక్కువ కేటాయిస్తుంటారు. చేతులు ఊపుతూ.. ‘చంద్రబాబు పాలన అంతా దోచుకో దాచుకో’ అనేదే విధానం అంటూ ఉంటారు. 

కానీ ప్రజలకు దోచుకోవడం దాచుకోవడం అంటే అసలు అర్థం ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. లిక్కర్ కుంభకోణంలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ.. ప్రజల కళ్లు తెరచుకుంటున్నాయి. ఒక్కచాన్స్ అడిగిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే.. ఇంత ఘోరంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, వారి మొహాన నకిలీ, చవకబారు మద్యం సీసాలను అమ్మేసి.. వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి సాహసించారా? అనే బాధ ప్రజల్లో కలుగుతోంది. వైఎస జగన్ సర్కారు కాలంలో మద్యం కుంభకోణంలో మూడున్నర వేల కోట్ల రూపాయలు దోచుకోవడం మాత్రమే కాదు.. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు బంగారం రూపంలో దాచుకున్నారంటే.. ఆ పార్టీ వారి తెలివితేటలకు ప్రజలు విస్తుపోతున్నారు. అలా దాచుకున్న సొమ్ము ఇప్పటికి మరో వెయ్యి కోట్లుగా రెట్టింపు అయి ఉంటుంది కదా.. దోచుకున్న సొమ్మును దాచుకోవడం అంటే ఎలాగో జగన్ ను చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే దోచుకో దాచుకో అనే డైలాగును జనాన్ని ఉద్దేశించి మరోసారి జగన్ వల్లించాలని ఎద్దేవా చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories