వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త ప్రాజెక్టు కూడా రాలేదు. పైగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో ఒప్పందాలన్నీ పూర్తయి గ్రౌండింగ్ కు సిద్ధంగా ఉన్న అనేక కంపెనీలను జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టారు. ఉద్యోగ ఉపాధుల కల్పన జరగలేదు. వీటన్నింటి పర్యవసానంగానే జగన్ ను ప్రజలు దారుణంగా ఓడించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి పరిశ్రమల స్థాపన కోసం ప్రాజెక్టులను తీసుకురావడం కోసం ప్రభుత్వ పరంగా ముమ్మర ప్రయత్నాలు మొదలయ్యాయి. అనేక కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
అయితే ఇప్పుడున్న ఎన్డీఏ సర్కారుతో ఒప్పందాలు చేసుకొని తమ ప్రాజెక్టులను ప్రారంభించాలనుకునే వారిలో జగన్ ఫోబియా కూడా ఉంటుందా? పరిస్థితులు తలకిందులు అయి భవిష్యత్తులో జగన్ సర్కారు మళ్లీ ఏర్పడితే తమ మీద కక్ష కడతారనే భయం పారిశ్రామికవేత్తలలో ఏర్పడుతున్నదా అనే సందేహాలు ఇప్పుడు వ్యాప్తిలోకి వస్తున్నాయి.
ఏబీఎన్ రాధాకృష్ణ కూడా ఇలాంటి సందేహాలను లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్థాయిలో కట్టడి చేయకుండా, నియంత్రించకుండా పారిశ్రామికవేత్తలలో భరోసా కలిగించడం అసాధ్యం అనే అభిప్రాయాన్ని రాధాకృష్ణ తన కథనంలో వ్యక్తం చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడం అంటే.. కేవలం ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టించడమే అనే అభిప్రాయం మాత్రమే అనుకుంటే తప్పు. కానీ రాజకీయంగా అహంకారంతో చెలరేగే ధోరణి తగ్గేలాగా ఆయనను బలహీనపరచడం అవసరం అని పలువురు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడం అనేది కేవలం ఎన్డీఏ కూటమి యొక్క రాజకీయ అవసరం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూడా అత్యవసరం అని ప్రజల భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక నెగటివ్ ఫోర్స్ అన్నట్లుగా ప్రజలు నమ్ముతున్నారు.
మరొక విషయం ఏమిటంటే.. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం పాల్పడిన అరాచకాలు కొత్తగా ఎన్ని వెలుగులోకి వస్తున్నప్పటికీ.. ఆయన మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం గురించి ప్రస్తుత ఎన్డీఏ సర్కారు పెద్దగా పట్టించుకోవడం లేదు అనే వాదన కూడా ప్రజల్లో ఉంది. జగన్ పట్ల చంద్రబాబు నాయుడు ఎందుకు మెతక ధోరణి అవలంబిస్తున్నారనేది పలువురికి అర్థం కావడం లేదు. జగన్ గద్దె ఎక్కిన వెంటనే చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలుకు పంపడానికి అనేక మార్గాలను అన్వేషించి.. చిట్టచివరికి ఏమాత్రం పసలేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి తన కోరిక నెరవేర్చుకున్నారు. జగన్ పాపాలు అనేకం వెలుగులోకి వస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు భావిస్తున్నారు