అడ్డంగా బొక్కిన సొమ్ములు ఆర్జీవీ కక్కవలసిందే!

జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి ఆయన అడ్డగోలుగా అబద్ధాలను వండివారుస్తూ సినిమాలను తీసిపారేశారు. జగన్ కు నచ్చితే చాలు ప్రపంచంలో మరెవ్వరికీ నచ్చాల్సిన పనిలేదు అన్నట్టుగా.. ఆయన ప్రత్యర్థులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లను విలన్లుగా చిత్రీకరిస్తూ రాంగోపాల్ వర్మ వ్యూహం 1,2 చిత్రాలు రూపొందించారు. అయితే కీలకమైన సంగతేంటంటే.. అవి జగన్ కు కూడా నచ్చనంత ఘోరంగా తయారయ్యాయి. జగన్ ప్రివ్యూలు చూసి.. చాలా మార్చేలా రీషూట్ చేయించారని, అసంతృప్తి వ్యక్తంచేశారని, అందుకే విడుదల ఆలస్యం అయిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఇంతా కలిపి అలా జగన్ తృప్తికోసం వర్మ సినిమాలు తీస్తే.. వర్మ లబ్ధి కోసం జగన్ ప్రభుత్వ ఖజానానుంచి దోచి పెట్టారు. అడ్డదారిలో దోచిపెట్టిన డబ్బు మొత్తం ఇప్పుడు ఆర్జీవీ కక్కవలసి వస్తోంది. తప్పుడు బిల్లులు తప్పుడు ఇన్ వాయిస్ లు ఇచ్చి కాజేసిన సర్కారు సొమ్ము మొత్తం తిరిగి చెల్లించాల్సిందే అంటూ.. ప్రభుత్వం రాంగోపాల్ వర్మకు  చిత్ర నిర్మాణంలోని ఇతర భాగస్వాములకు నోటీసులు పంపింది. మొత్తం 1.14 కోట్ల రూపాయలు అక్రమంగా పొందారని, ఆ డబ్బును 12 శాతం వడ్డీతో సహా 15 రోజుల్లోగా చెల్లించాలని సూచించారు. ఈలోగా కట్టకపోతే జరిమానా కింద 18శాతం వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది.

సాధారణంగా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఫస్ట్ షో ప్లాట్ ఫారంపై ప్రదర్శించేందుకు కొత్త సినిమాలకు అవకాశం ఉంటుంది. సంస్త ఇప్పటిదాకా 25 సినిమాల ప్రదర్శనకు నిర్మాతలతో ఒప్పందం చేసుకుంది. వచ్చే ఆదాయంలో నిర్మాత- ఫైబర్ నెట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకునేలా అన్ని ఒప్పందాలు కుదిరాయి. అయితే జగనన్నకు రాంగోపాల్ వర్మ మరియు ఆయన తీసిన వ్యూహం సినిమా చాలా ప్రత్యేకం కాబట్టి ఆయనకు మాత్రం 75శాతం ఇచ్చేలా, ఫైబర్ నెట్ 25 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. అదొక్కటే కాదు. రెండు లక్షల చందాల వరకు వన్ టైం పేమెంట్ కింద రూ.2 కోట్లు ఇచ్చేలా, రెండు లక్షల కంటె ఎక్కువ వస్తే ఇలా ఆదాయం పంచుకునేలా ఆ ఒప్పందం కుదిరింది.

మొత్తానికి వ్యూహం 1 సినిమాను 1845 మంది, పార్ట్ 2 ను 383 మంది మాత్రం చూశారు. అంటే పార్ట్ 1 కు 1.86 లక్షలు, పార్ట్ 2 కు యాభైవేలు చెల్లిస్తే సరిపోతుంది. దానికి విరుద్ధంగా 1.14 కోట్ల చెల్లింపులు ముందే జరిగిపోయాయి. నిర్మాతలతో ఫైబర్ నెట్ కుమ్మక్కై ఇలా చేసిందని ప్రస్తుతం నిగ్గు తేల్చారు. ఆ మొత్తం వర్మ నుంచి రికవరీ చేయడానికి నోటీసుల పంపారు. రాంగోపాల్ వర్మ తను చేసిన నేరం బయటపడిపోయింది గనుక.. నోరు మెదపకుండా మొత్తం డబ్బు చెల్లించేసి సైలెంట్ గా కూర్చుంటారో.. లేదా, తన సహజశైలిలో రెచ్చిపోయి కామెంట్లు చేసి వివాదాన్ని మరింత పెంచుకుంటారో వేచిచూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories