‘పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి రాలేదు, ఎందుకొచ్చారో తెలియదు’ అంటూ ఎద్దేవా? ‘నేను గోడదూకి పారిపోయానని, మంచం కింద నక్కానని రకరకాలుగా రాస్తున్నారు. ఇదంతా మీడియా సృష్టి’ అంటూ ఎగతాళి! ‘నేను డెన్ లోనే ఉన్నా.. నన్ను ఎవరు ఏం చేయగలిగారు?’ అంటూ మిస్ లీడింగ్ స్టేట్మెంట్లు… ఎన్నిరకాలుగా మాటలు మార్చి మాయ చేస్తూ వచ్చినా.. బాహ్య ప్రపంచానికి కనిపించకుండా.. వీడియోలు, టీవీ ఇంటర్వ్యూలు మాత్రం విడుదల చేసిన దర్శకుడు ఆర్జీవీ సోమవారం సాయంత్రం తన అహంకారాన్ని, అతిని ఇంకా బాగా ప్రదర్శించారు. హైకోర్టు వచ్చే సోమవారం దాకా అరెస్టు చేయకుండా రక్షణ కల్పించిన నేపథ్యంలో ఆయన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు.
ఆర్జీవీ ఎంతగా రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తూ వంకర మాటలు మాట్లాడుతూ ఉంటారో.. ఆయన ప్రసంగాలే పెద్ద నిదర్శనం. ఆయన చెప్పే ఒక్కొక్క మాటను పరిశీలిస్తే చాలా తమాషాగా అనిపిస్తుంది.
నేను ఏడాది కిందట పోస్టులు పెడితే.. ఎవరి మీద పెట్టానో వాళ్లకు కాకుండా.. వేరే ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయని నా మీద నాలుగు చోట్ల కేసులు పెట్టారు. అసలు ఈ సెక్షన్లు వేరొకరి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఎలా వర్తిస్తాయో నాకు అర్థం కావడం లేదు.. అంటూ వర్మ అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం.. తన పోస్టులు నచ్చకపోతే నేరుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లు తన మీద కేసులు పెట్టాలి కదా.. అని! ఫరెగ్జాంపుల్ హిందువులు కొలుచుకునే రాముడి గురించి చీప్ కామెంట్స్ తో పోస్టులు పెడితే.. రాముడే వచ్చి కేసు పెడితే తప్ప రిజిస్టరు చేయడానికి వీల్లేదని వర్మ మాటల అంతరార్థంలాగా ఉంది.
ఒకవైపు తనను అరెస్టు చేసి జైల్లో పెడితే ఏం బాధపడనని.. ఎంచక్కా ఖైదీలతో మాట్లాడి కొత్త కథలు రాసుకుంటానని వర్మ అంటున్నారు. పైకి ఇలా మేకపోతు గాంభీర్యంతో ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. సోమవారం నాడు అరెస్టు నుంచి ఊరట కల్పించే వరకు అసలు కలుగులోంచి బయటకు రాకుండా దాక్కున్న వ్యక్తి రాంగోపాల్ వర్మ! ఇప్పుడు మాత్రం తన సహజమైన అహంకారాన్ని, అతిశయాన్ని ప్రదర్శిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కాకుండా శాశ్వతంగా తప్పించుకోజాలరు కదా.. అని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.