తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి సిబిఐ విచారణ చేయించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానించడం కీలక పరిణామం. ఆదివారం అర్ధరాత్రి దాటే వరకు సుదీర్ఘమైన చర్చ జరిపిన తర్వాత కాళేశ్వరం కుంభకోణం పై సిబిఐ విచారణ కోరుతూ రేవంత్ ప్రకటన చేసి, అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదావేశారు. అసెంబ్లీ తీర్మానం గురించి కేంద్ర హోం శాఖకు లేఖ కూడా రాశారు. సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ బంతి కేంద్రం కోర్టులో వేశారు.
దీని పర్యవసానంగా ఏం జరిగినా సరే రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ సిబిఐ విచారణకు కేంద్రం ఆమోదం తెలిపితే కేసీఆర్, హరీష్ రావు ల పాత్ర గురించి కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడడానికి రేవంత్ రెడ్డికి అవకాశం ఉంటుంది. ఎటొచ్చీ సిబిఐ విచారణ ఒకటి రెండేళ్లలో ముగిసే వ్యవహారం కాదు. ఆ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి భారత రాష్ట్ర సమితిని, కెసిఆర్ ను బదనాం చేయడానికి దీనిని కాంగ్రెస్ వాడుకుంటుంది.
అదే సమయంలో మరొక సంభావ్యత కూడా ఉంది. సిపిఐ విచారణకు కేంద్ర హోం శాఖ ఆమోదం చెప్పకపోతే గనుక.. భారత రాష్ట్ర సమితి అనేది భారతీయ జనతా పార్టీకి బీ టీం అని.. కెసిఆర్ ను కాపాడడం కోసమే, మామాఅల్లుళ్లను జైలుకు పంపకుండా చూడడం కోసమే సిబిఐ విచారణకు కేంద్రం తిరస్కరిస్తున్నదని రేవంత్ ఆరోపించగలరు. తద్వారా రాజకీయ ప్రత్యర్థులు రెండు పార్టీలనూ జమిలిగా కలిపి నిందలు వేయడానికి రేవంత్ రెడ్డికి ఆస్కారం దొరుకుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఎలాంటి విచారణ జరిగినా సరే ఏకపక్షంగా, కక్షపూరితంగా విచారణ చేశారు అని నిందలు వేస్తారు గనుక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐకు అప్పగిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. కానీ ఈ ఎత్తుగడ ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరినీ ఇరుకున పెట్టవచ్చని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ పరిణామం జరిగినా ఏదో ఒక అడ్వాంటేజీ తీసుకోగలరని విశ్లేషకులు అంటున్నారు.