కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపులు జరగలేదని ఆ రాష్ట్ర నాయకత్వం భావిస్తే గనుక అంతవరకు ఢిల్లీ సర్కారు తీరు మీద విమర్శలు చేయడంలో తప్పులేదు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ ద్వారా ఏం కావాలని వారు కోరుకుంటున్నారో.. ఏం కావాలని కేంద్ర ప్రభుత్వానికి వారు నివేదించారో.. వాటిని పట్టించుకోకుండా బడ్జెట్ కేటాయింపులు జరిగి ఉంటే గనుక అవన్నీ ప్రస్తావించి విలపిస్తే ఇంకా బాగుంటుంది. అదేమీ లేకుండా అర్థం పర్థం లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ కు చాలా కేటాయింపులు చేసేసారు అని విలపించడం సరైన పద్ధతి కాదు! విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు దక్కవలసిన కేటాయింపులను కేంద్రం 10 ఏళ్ల పాటు పట్టించుకోకుండా ఇప్పుడు కేటాయించింది అనే సంగతిని తెలంగాణ సర్కారు గుర్తించాలి. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని నిందించడానికి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు జరిగిన తీరును వాడుకోవడం చాలా అసంబద్ధంగా ఉన్నదని ప్రజలు విమర్శిస్తున్నారు.
కేంద్రంలో ఉన్నది ‘నాయుడు నితీష్ డిపెండెంట్ ప్రభుత్వం’ అని ఎన్డీఏ అనే పదానికి ఒక సరికొత్త నిర్వచనం చెప్పాలని రేవంత్ రెడ్డి అత్యుత్సాహం చూపించవచ్చు గాక! కానీ ఇలాంటి పడికట్టు మాటల వలన ఉపయోగం తక్కువ. నిర్దిష్టంగా కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేయడం అంటే విభజన చట్టంలో తమకు జరగాల్సిన న్యాయం గురించి రేవంత్ ఏయే అంశాలను కేంద్రం వద్ద ప్రతిపాదించారో, వాటిని మీడియా ముందు పెట్టాలి. తాము ఎన్ని విజ్ఞప్తులు అడిగినప్పటికీ ఏది పట్టించుకోలేదని ఆ రకంగా కేంద్రం వంచించిందని ఆరోపిస్తే పరవాలేదు. అంతేతప్ప పొరుగురాష్ట్రానికి ఇచ్చేశారని ఏడుస్తూ అందువలన కేంద్రం తనకు అన్యాయం చేసినట్టుగా మాట్లాడడం పూర్తిగా తప్పు అని పలువురు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రెండు కూడా వెనుకబడి ఉన్న రాష్ట్రాలు అనే విషయంలో రేవంత్ రెడ్డికి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఆ రాష్ట్రాల వెనుకబాటుతనాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారా? విభజన తర్వాతి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ఎంతటి అనాధగా దుర్భరమైన పరిస్థితుల్లో ఏర్పడినదో రేవంత్ రెడ్డికి తెలియదా? ఆత్మసాక్షిని చంపుకొని ఇలాంటి అబద్ధపు నిందలు వేయడం ఎందుకు అని అందరూ అడుగుతున్నారు.
ప్రత్యేకంగా తెలంగాణ అనే పేరును ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ రాష్ట్రానికి దక్కే కేంద్ర కేటాయింపులు లేకుండా పోవు కదా అనేది కూడా కొందరి వాదన. కేవలం తాము ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన వారం గనుక బిజెపి ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా సరే దానిని నిందించి తీరడం తమ బాధ్యత అనుకుంటున్నట్లుంది. ఇలాంటి అర్థంపర్థం లేని మాటలను తగ్గించి నిర్మాణాత్మక విమర్శలు చేస్తే అందరికీ మేలుగా ఉంటుందని అభిప్రాయాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.