పొట్టి శ్రీరాములు పేరిట ఉన్న తెలుగు యూనివర్సిటీకి పేరుమార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు తలపోసింది. పొట్టి శ్రీరాములు పేరును తొలగించడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఈ పేరుమార్పునకు సంబంధించిన బిల్లును రేవంత్ రెడ్డి తరఫున దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ డొంకతిరుగుడుగా ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి తలాతోకాలేకుండా మాట్లాడారనే విమర్శలు వస్తున్నాయి.
రేవంత్ రెడ్డి బిజెపి వారికి కౌంటర్ ఇవ్వడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్నారు. తెలంగాణలో గతంలో కూడా వివిధ యూనివర్సిటీల పేర్లను మార్చి, తెలంగాణ నేతల పేర్లు పెట్టారని గుర్తుచేశారు. తెలంగాణ వైతాళికుడిగా పేరున్న సురవరం పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టదలచుకున్నట్టు చెప్పారు. పొట్టి శ్రీరాములు మీద తనకు కూడా చాలా గౌరవం ఉన్నదని, ఆయన పేరు మార్చడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు.. ఇటీవలే ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టేలా కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన కోరారు. ఈ మేరకు కావలిస్తే తాను కూడా ఆ మంత్రులకు లేఖ రాస్తానని సెలవిచ్చారు.
రేవంత్ రెడ్డికి సురవరం మీద నిజంగానే అంత భక్తి ఉంటే గనుక.. తెలుగు యూనివర్సిటీకి పేరుమార్చే బదులుగా.. ఆయన చెబుతున్న చర్లపల్లి రైల్వే టర్మినల్ కు ఆయన పేరు పెట్టాలని కేంద్రానికి లేఖరాస్తే సరిపోతుంది కదా అనేది ప్రజల సందేహం. ఒకదానికి ఉన్న పేరు తీసేసి కొత్త పేరు పెట్టి, తీసేసిన పేరును మరో సంస్థకు పెట్టాలని అడగడం మరీ డొంకతిరుగుడుగా ఉన్నది కదా.. అనేది ప్రజల సందేహం.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అసంబద్ధమైన ప్రతిపాదన కూడా చేశారు. దివంగత నాయకుడు కొణిజేటి రోశయ్య నివాసం ఉండిన ఇంటికి సమీపంలో ప్రకృతి చికిత్సాలయం ఉన్నదని, దానికి రోశయ్య పేరు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నదని అంటున్నారు. ఈ సందర్భంగా రోశయ్య గొప్ప నాయకుడని ప్రశంసించారు. నిజానికి ఈ మాట కూడా తలాతోకాలేకుండా ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన రోశయ్య గొప్ప నాయకుడే కావొచ్చు గాక.. కానీ జాతీయ నాయకుడు కాదు! ఆయన పేరు తెలంగాణ, హైదరాబాదులోని సంస్థకు పెట్టవలసిన అవసరమేంటో తెలియడం లేదు. కాంగ్రెస్ నాయకుడు గనుక.. ఆ పేరు పెట్టాలని రేవంత్ భావిస్తున్నట్టుంది. అలాగే.. పొట్టి శ్రీరాములు పేరు తొలగించడంలో ఆర్యవైశ్యులు ఆగ్రహిస్తారనే భయంతో.. వారిని ఊరడించడానికి రోశయ్య పేరు పెట్టడం బాలేదని అంటున్నారు. చేసేదే పొరబాటు కాగా..దానిని కవర్ చేసుకోవడానికి గిమ్మిక్కులు చేస్తున్నారని అంటున్నారు.
అలాగే అహ్మదాబాద్ లోని బిజెపి ప్రభుత్వంపై కూడా రేవంత్ విమర్శలు చేశారు. అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం పేరు మార్చి, నరేంద్ర మోడీ పేరు పెట్టారని, తాము అలాంటి తప్పులు చేయడం లేదని రేవంత్ చెప్పుకున్నారు. ఇది కూడా పూర్తిగా అబద్ధం. నిజానికి అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. అందులో భాగంగా ఉన్న క్రికెట్ స్టేడియంకు మోతెరా స్టేడియం అనే పేరు ఉండేది. దానికి మాత్రమే నరేంద్రమోడీ స్టేడియం అని పేరు పెట్టారు. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారంతో సభను పక్కదారి పట్టించేలా మాట్లాడినట్టుగా విమర్శలు వస్తున్నాయి. పాలకపక్షం పొట్టి శ్రీరాములు పేరు తీసేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత.. అది మారకపోవచ్చు గానీ.. దానిని సమర్థించుకోవడానికి రేవంత్ చెబుతున్న వాదనలు మాత్రం ఆయన డొంకతిరుగుడు వైఖరిని బయటపెడున్నాయి.