కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల విషయంలో పొరుగు రాష్ట్రాల వారికి కూడా ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గం కడప. ఇక్కడినుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎంపీ అవినాష్ రెడ్డితోను, అవినాష్ ను మళ్లీ గెలిపిపంచడానికి కంకణం కట్టుకున్న అన్న జగన్ తోను ఆమె తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ ను గెలిపించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని, మేనెల మొదటివారం తర్వాత ఆయన ఒకరోజు సుడిగాలి ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి.. బాధ్యత గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గాను, ముఖ్యమంత్రిగాను ఊపిరి సలపని బాధ్యతల్లో ఉన్నప్పటికీ కూడా.. ఆయన కేరళ వెళ్లి అక్కడ కాంగ్రెసుకు అనుకూలంగా ప్రచార సభలు నిర్వహించారు. అలాగే కర్ణాటకలో కూడా సుడిగాలి పర్యటనలతో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఏపీలో కూడా ప్రత్యేకించి కడప నియోజకవర్గంలో తనను గెలిపించడానికి రేవంత్ వచ్చి ప్రచారం చేయాల్సిందిగా.. వైఎస్ షర్మిల ఆయనను కోరినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పలుప్రాంతాల్లో సభలు నిర్వహించాలని షర్మిల కోరినప్పటికీ, తన సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతల ఒత్తిడిని కూడా చూసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ఒక్కరోజు ప్రచారానికి మాత్రం అంగీకరించినట్టు తెలుస్తోంది. కడపలో మాత్రమే ఆయన పర్యటించనున్నారు.
ఇప్పటికే షర్మిల తన పదునైన విమర్శనాస్త్రాలతో వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నారు. జగన్ ను ఆత్మరక్షణలో పడేస్తున్నారు. చిన్నాన్నను చంపిన హంతకుడిని మళ్లీ గెలిపించి పార్లమెంటుకు పంపుతారా? అని ప్రజలను నిలదీస్తున్నారు. హంతకుడికి మద్దతివ్వడానికి మనసెలా వచ్చిందని జగన్ ను అడుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు కాగా.. రేవంత్ రెడ్డి కూడా కడపలో ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో రేంజిలో ఊపు వస్తుందని, సూటిగా పదునైన విమర్శలు చేయడంలో మేటి అయిన రేవంత్ రెడ్డి షర్మిల విజయానికి దోహదం చేస్తారని అంతా అనుకుంటున్నారు.