బనకచర్లపై టీఆర్ఎస్ ఉచ్చులో పడుతున్న రేవంత్

బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చెప్పినా సరే.. దానిని వ్యతిరేకించడం మాత్రమే రాజకీయంగా తమకు రక్ష అనే అపోహల్లో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడి కొట్టుకుంటున్నదా? బనక చర్ల విషయంలో కేంద్రానికి అభ్యంతరాలు తెలియజేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం మాత్రమే కాదు.. తాజా పరిణామం కూడా ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలో 16వ తేదీన కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే సమావేశంలో బనకచర్ల గురించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించాలని ఏపీ ప్రతిపాదించగా, ఈ బేటీలో ఆ చర్చ అవసరం లేదని స్పష్టం చేస్తూ తెలంగాణ సర్కారు కేంద్రానికి లేఖ రాయడం అనేది పెడసరం ధోరణికి ప్రతిబింబం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గోదావరి – బనచర్ల  ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్దదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్  సమావేశం కానున్నారు. ఈ భేటీకోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ అంశంతో పాటు రాష్ట్రాల తరఫున మాట్లాడాల్సిన ఇతర అంశాలు ఏమైనా ఉంటే, అజెండా పాయింట్లుగా పంపాలని.. కేంద్రం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ సింగిల్ పాయింట్ ఎజెండా మాత్రమే ఇచ్చింది. అయితే తాజాగా.. బనకచర్ల చర్చించాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ సర్కారు లేఖ రాయడం అనేది.. ఏపీతో సున్నం పెట్టుకునే ధోరణికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే తెలంగాణ సర్కారు చేస్తున్న మరో తేడా ఏంటంటే.. కృష్ణానదిపై తెలంగాణలో పెండింగు ప్రాజెక్టులకు అనుమతులను అజెండాగా ప్రతిపాదించడం. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని ఎజెండాగా తెలంగాణ కేంద్రానికి పంపింది.

వీటితో పాటు 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని మరో ప్రతిపాదన పెడుతూనే, బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, ఈ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని ప్రతిపాదించింది.

చూడబోతే.. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే బీఆర్ఎస్ పన్నిన ఉచ్చులో రేవంత్ సర్కారు ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోంది. ఆయకట్టు చివరి రాష్ట్రం వరద జలాల కోసం నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టును అడ్డుకోవాలని చూడడం ఒక కుట్ర కాగా, ఆయకట్టు ఎగువభాగంలో ఉంటూ.. వరదజలాలకు తమ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టు కావాలని అడగడం మరో కుట్ర. పైగా తమ రాష్ట్రంలో ప్రాజెక్టులకు జాతీయహోదా కావాలంటే.. కేంద్రం వద్ద పోరాడి తెచ్చుకోవచ్చు. దానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండాల్సిన అవసరం ఏముంది? ఇద్దరూ వస్తున్నప్పుడు.. ఇరు రాష్ట్రాలకు సంబంధం ఉండే వ్యవహారాలనే కదా తేల్చుకోవాలి అని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories