టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ నెల రచ్చగా మారబోతోంది. వరుసగా కొత్త సినిమాలు థియేటర్లకు సిద్ధం అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కానీ రిలీజ్ డేట్స్ విషయంలో మాత్రం మేకర్స్ గందరగోళానికి గురవుతున్నారు. ఎప్పుడు ఏ సినిమా వస్తుందో స్పష్టంగా తెలియకపోవడం వల్ల సినిమాప్రియులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ జాబితాలో స్టార్ సినిమాలు మాత్రమే కాకుండా క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
సెప్టెంబర్‌లో రిలీజ్ కావాల్సిన సినిమాల్లో ఎక్కువ అంచనాలు తెచ్చుకున్నది మిరాయ్. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 5న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ రోజున సినిమా విడుదల చేయడం సాధ్యంకాదని తెలుస్తోంది. అందుకే మేకర్స్ మరో వారం లేదా రెండు వారాల తర్వాత రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్.
ఈ ఖాళీని ఉపయోగించుకోవాలని చూస్తున్నది లిటిల్ హార్ట్స్. #90s ఫేమ్ మౌళి టాక్స్ హీరోగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో అనుష్క శెట్టి నటించిన ఘాటి కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే పోటీని తప్పించుకునేందుకు ఆ సినిమాను ఒక రోజు ముందుగానే తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని సమాచారం.
అదే రోజున తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరోగా చేసిన మదరాసి కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆగస్టు 27న రావాల్సిన రవితేజ సినిమా మాస్ జాతరను కూడా సెప్టెంబర్‌కి మార్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. కానీ దాని రిలీజ్ డేట్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి మాత్రం షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి సెన్సేషన్ క్రియేట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.