వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస మర్యాద తెలియడం లేదు. మనం ఎక్కడైతే ఉన్నామో.. అక్కడి పద్ధతుల్ని పాటించడం, నియమాల్ని గౌరవించడం అవసరం అనే బాధ్యత వారికి తెలియడం లేదు. చివరికి దైవసన్నిధిని కూడా అపవిత్రం చేయడానికి, తమ రాజకీయ గలీజు మాటలతో చెలరేగిపోవడానికి వారు వెనుకాడడం లేదు. మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి.. తిరుమలకు వచ్చి దేవుని దర్శించుకున్న తరువాత.. బయటకు వచ్చి రాజకీయ ప్రసంగం చేయడం ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదం అవుతోంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను, కార్యకలాపాలను నిషేధించిన టీటీడీ ధర్మకర్తల మండలి ఇప్పుడు.. రవీంద్రనాధ్ రెడ్డి మీద చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తోంది.
సాధారణంగా నాయకులు తిరుమలేశుని దర్శించుకున్నప్పుడు.. బయటకు రాగానే.. మీడియా పలకరిస్తే స్టీరియో టైపు మాటలు మాట్లాడుతుంటారు. ప్రజలందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంన్నట్టుగా బయటకు వచ్చి చెబుతారు. ఆ రకంగా.. దేవుడిని దర్శించుకున్న వెంటనే, అయిదు పదినిమిషాలైనా గడవక ముందే.. బయటకు వచ్చి అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. గతంలో ఇంకా ఘోరంగా ఉండేది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన ప్రతిసారీ.. జగనన్నకు దేవుడి కరుణ ఉండాలని, జగనన్న పాలనలో రాష్ట్రంలోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అంటుండేవాళ్లు. ఇలాంటి రాజకీయ ప్రసంగాలకు దేవుడి ప్రాంగణంలో చెక్ పెట్టాలని బిఆర్ నాయుడు నేతృత్వంలోని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి పూర్తిగా రాజకీయ ప్రసంగాలను, కార్యకలాపాలను నిషేధించారు.
నాయకులు కూడా ఆ మర్యాదను పాటిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం పరంగా ఏ నియమాలైతే ఉంటాయో వాటిని ధిక్కరిస్తే తప్ప తమకు ఆనందం ఉండదని భావిస్తారో ఏమో గానీ.. జగన్ మేనమామ రవీంద్ర నాధరెడ్డి అదే పనిచేశారు. తిరుమలలో దైవదర్శనానంతరం కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి తమ సమయాన్నంతా కేటాయించారు.
కడపజిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికారపార్టీ అక్రమాలు చేస్తున్నదని నిందలు వేయడానికే ఆయన పరిమితం అయ్యారు. దేవుడి సన్నిధిని కూడా ఆయన తన రాజకీయ గలీజు మాటల కోసం వాడుకోవడం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.