రేవ్ పార్టీ, డ్రగ్స్ ఊబిలో మంత్రి కాకాని!

నాయకులు ఇప్పుడు ఎలాంటి వివాదాలలో చిక్కుకున్నా పెద్ద తేడా ఏమీ లేదు. ఎన్నికల పోలింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ఇప్పటికిప్పుడు వారు తప్పుడు పనులు చేసి దొరికిపోయినా సరే ప్రజా జీవితంపై తక్షణ ప్రభావం ఉండదు. అయినా సరే తప్పుడు పనులు వివాదాలు ఎప్పటికీ ముప్పే! జగన్ ప్రభుత్వంలోని మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి ఇప్పుడు అలాంటి వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరులో బయటపడిన రేవ్ పార్టీ, డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన పాత్ర ఉన్నట్టుగా అనుమానాలు కలిగించే ఆధారాలు కూడా బయటపడటంతో అంత సులువుగా ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తున్నది.

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారంలో తెలుగు సినిమా, టీవీ ఇండస్ట్రీకి చెందిన నటీమణులు చిక్కుకోవడం ఒక ఎత్తు అయితే.. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నదనే ప్రచారం మరో ఎత్తు. పార్టీ జరిగినచోట పోలీసులు సీజ్ చేసిన 15 ఖరీదైన కార్లలో కాకానికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న బెంజ్ కారు కూడా ఒకటి. ఆ కారులో ఆయన పాస్పోర్ట్ కూడా దొరికినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తన ఎమ్మెల్యే స్టిక్కరును ఫోర్జరీ చేశారని ఆ తర్వాత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా రేవ్ పార్టీ జరిగిన ప్రాంతం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆప్తుడు అయినటువంటి గోపాల్ రెడ్డికి సంబంధించినదే అని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాకానికి సంబంధించిన మాఫియా వ్యక్తులే ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారనేది ఆయన ఆరోపణగా ఉంది. కేవలం రేవ్ పార్టీ వరకు అయితే కేసుల ఊబి ఒకరకంగా ఉండేది.. కానీ ఆ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం కూడా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బెంగళూరు డ్రగ్ మాఫియా కు మంత్రి కాకానికి సంబంధం ఉందన్నట్లుగా సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ పార్టీని అంతర్రాష్ట్ర సమస్యగా పరిగణించి విచారణలో కేంద్రం జోక్యం చేసుకోవాలని సోమిరెడ్డి  డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి కాకాని చుట్టూ ఇప్పటికే పలు వివాదాలు ఉన్నాయి. తన మీద విచారణ జరుగుతున్న కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టు నుంచి మాయం చేయించారనే ఆరోపణ కూడా ఆయన మీద ఉంది. ఇన్ని ఆరోపణల మధ్యనే ఆయనే ఎన్నికలను ఎదుర్కొన్నారు. కొత్తగా ఇంకో వివాదం పుట్టడం వలన ప్రజల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో ఏమోగానీ.. ఒకవేళ ఆయన కూడా నెగ్గి , జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడే పరిస్థితి వస్తే మంత్రి పదవి మీద ఆశలను వదిలేసుకోవచ్చు!

Related Posts

Comments

spot_img

Recent Stories