ఈ మాటలు ఎవరు అన్నారో తెలుసా? తెలుగుదేశం పార్టీ అభిమానులు వైసీపీకి చెందిన మిత్రులతో సరదాగా ఇలా అంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోరు- అని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం వారు ఇలా సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడే.. జగన్మోహన్ రెడ్డి మొహంలో కత్తివేటుకు నెత్తురుచుక్క లేదు.
పాలిపోయిన మొహంతో ‘అసలు ఏం జరిగిందో దేవుడికి తెలుసు’ అంటూ మాట్లాడారు జగన్. తనను పాతాళానికి తోసేసిన ఈ పతనాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని కళ్ల జూడలేక, కార్యక్రమానికి కూడా వెళ్లడం లేదు. ఈనేపథ్యంలోనే ‘‘జగన్‌ను రమ్మనండ్రా.. ఆ మొహం చూడాలని ఉంది!’’ అనేది ట్రోల్ అవుతోంది.
ఇదే మాటతో జగన్ ను ట్రోల్ చేయడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది కేవలం జగన్ స్వయంకృతమే. ఆయన అన్న మాటలనే తెలుగుదేశం వారు ఇప్పుడు మళ్లీ రిపీట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మునిపిపాలిటీలని వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక్క మునిసిపాలిటీని గెలుచుకోవడానికి ఏ స్థాయిలో అక్రమాలు చేయాలో అన్నీ చేశారు. తెలుగుదేశం తరఫున నామినేషన్లు వేయకుండా కిడ్నాపులు చేశారు. పోలీసుల సహకారంతోనే కేసులు పెట్టించారు. బెదిరించారు.. నానా హంగామా చేశారు. మొత్తానికి కుప్పం మునిసిపాలిటీ జగన్ దళానికి దక్కింది.
మునిసిపాలిటీని దక్కించుకోవడంతోనే.. అసలు చంద్రబాబును ఓడించేసినంతగా వైసీపీ పండగ చేసుకుంది.
ఆ ఎన్నికల తర్వాత శాసనసభ కొలువు తీరిన సందర్భంలో.. ముందుగా జరిగే బిఏసీ సమావేశానికి తెలుగుదేశం తరఫున అచ్చెన్నాయుడు వచ్చారు. ‘‘మీ నాయకుడిని రమ్మని చెప్పు.. ఓసారి మొహం చూడాలని ఉంది’’ అంటూ వెటకారం చేశారు. అది తీవ్రమైన అహంకారప్రదర్శనే అయినప్పటికీ అచ్చెన్నాయుడు మౌనంగా ఉండిపోయారు.
ఇప్పుడు ఆ మాటలను పట్టుకునే.. తెలుగుదేశం వారు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ‘‘జగన్‌ను రమ్మనండ్రా.. ఆ మొహం చూడాలని ఉంది!’’ అని అంటున్నారు. కుప్పం మునిసిపాలిటీలో ఓటమి కంటె.. ఇప్పుడు జగన్ కు ఎదురైన పతనం చాలా పెద్దది. అందుకే ఆయనను కూడా అదే స్థాయిలో ఎద్దేవా చేస్తున్నారు.