విశాఖపట్నంలో సినీ స్టుడియోస్ నిర్మాణం కోసం పొందిన భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి వ్యాపారం చేసుకోవడానికి జగన్ హయాంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న రామానాయుడు స్టుడియోస్ సంస్థ.. ఆ ప్రతిపాదనపై ఇప్పుడు పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఏ ప్రయోజనం కోసం వారికి స్థలం కేటాయించారో దానికోసం కాకుండా ఇతర అవసరాల కోసం వాడుతున్నప్పుడు.. ఆ స్థల కేటాయింపులను రద్దు చేయడం గురించి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం విశాఖ జిల్లా కలెక్టరు వారికి షోకాజు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆలోచన వదలిపెట్టి.. స్టుడియోల నిర్మాణంతోనే ముందుకు వెళ్లాలని ఆ సంస్థ అనుకుంటున్నట్టు సమాచారం.
విశాఖపట్నంలో సినీ పరిశ్రమ వేళ్లూనుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం రామానాయుడు స్టుడియోస్ సంస్థకు గతంలో విశాఖపట్నంలో 34 ఎకరాల భూమిని కేటాయించింది. కొంతమేర స్టుడియోలు నిర్మించారు కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ సంస్థ తరఫు నుంచి ప్రభుత్వానికి ఒక కొత్త ప్రతిపాదన పెట్టారు. ఆ స్థలంలో 15.17 ఎకరాలు హౌసింగ్ లేఅవుట్ కోసం అనుమతులు ఇవ్వాలని, అందుకు తగినట్లుగా అనుమతుల్లో మార్పులు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇలాంటి ప్రతిపాదన వెనుక.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దలు ఉన్నట్టుగా పుకార్లు వినిపించాయి. జగన్మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన నాటినుంచి.. అక్కడి స్థలాలపై కన్నేసిన వైసీపీ పెద్దలు అపరిమితంగా భూకబ్జాలకు, స్వాధీనాలకు విచ్చలవిడిగా పాల్పడిన వైనం కథలుకథలుగా ప్రచారంలో ఉంది. ఆ క్రమంలో భాగంగానే.. రామానాయుడు స్టుడియోస్ కు కేటాయించిన భూముల్లో కూడా దందా నడిపించడానికి వారు తెర వెనుక ఉండి.. ప్రభుత్వం వద్ద అనుమతులు తామే తీసుకువస్తాం అని చెప్పి లేఖ రాయించినట్టుగా ప్రచారం ఉంది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అసలు అనుమతి సంగతి కాదు కదా.. నిర్దిష్ట ప్రయోజనం పక్కన పెట్టి.. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకోవాలనే ఆలోచనకు చెక్ పెట్టింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ ఇచ్చారు. దీంతో రామానాయుడు స్టుడియోస్ సంస్థ ఆలోచన మార్చుకుందని సమాచారం. అక్కడ స్టుడియోలే నిర్మిస్తామని.. హౌసింగ్ ప్లాట్లు వేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వానికి తెలియజేయబోతున్నట్టు సమాచారం. ఈ సంస్థను అడ్డు పెట్టుకుని విశాకలో 15 ఎకరాల్లో రియల్ దందా నడిపించడానికి తెరవెనుక నుంచి కుట్రలు నడిపిన వైసీపీ నేతలకు దీంతో చెక్ పెట్టినట్టు అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.