మెట్టుదిగి రానున్న రామానాయుడు స్టుడియోస్!

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. చేపట్టిన అనేక దిద్దుబాటు చర్యల్లో భాగంగా.. రామానాయుడు స్టుడియోస్ వారికి కూడా నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నంలో రామానాయుడు ఫిలిం స్టుడియోస్ నిర్మాణానికి గతంలో 34.4 ఎకరాల భూమిని వారికి కేటాయించారు. కొంత మేర నిర్మాణాలు చేపట్టారు కూడా. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పాలన సాగుతున్న రోజుల్లో ఆ భూమిలో 17.7 ఎకరాలను  వెంచర్ గా వేయడానికి ప్రభుత్వ అనుమతి కోరుతూ వారు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. జగన్ సర్కారు నిర్ణయం తీసుకునేలోగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కేటాయించిన భూమిని ఉద్దేశించిన ప్రయోజనాలకు కాకుండా.. వేరే అవసరాలకు వాడడం, రియల ఎస్టేట్ చేయడం తగదని ఆ పరిస్థితుల్లో భూ కేటాయింపులను రద్దు చేయవచ్చుననే సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి.. రామానాయుడు స్టుడియోస్ వారికి నోటీసులు ఇచ్చారు. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమచారాన్ని బట్టి.. ఈ విషయంలో ఆ సంస్థ ఒక మెట్టు దిగి వస్తుందని సమాచారం.

నిబంధనలకు విరుద్ధంగా అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడానికి స్టుడియోస్ వారు జగన్ సర్కారుకు దరఖాస్తు చేయడం వెనుక కొందరు వైసీపీ పెద్దల హస్తం ఉన్నట్టుగా కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ మిషపై స్టుడియో భూముల్ని కాజేయడానికి కుట్ర జరిగినట్టుగా అనుకున్నారు. అలా నిబంధనలకు వ్యతిరేకంగా వెంచర్లు వేయడం తగదని కూటమి ప్రభుత్వం ఆగ్రహించడంతో, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా కలెక్టరు హరేంధిరప్రసాద్.. వారికి నోటీసులు జారీచేశారు. పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకుంటే.. చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.

అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. వెంచర్ వేయడానికి అనుమతులు అడిగిన దరఖాస్తునే ఉపసంహరించుకుంటామని రామానాయుడు స్టుడియోస్ ప్రభుత్వానికి లేఖ రాయనుున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 34.4 ఎకరాల భూమిని కూడా పూర్తిగా స్టుడియో నిర్మాణానికి మాత్రమే కేటాయిస్తాం అంటూ.. వారు ప్రభుత్వానికి నివేదించనున్నారు. అప్పుడిక భూకేటాయింపుల రద్దు ప్రస్తావనే తలెత్తకపోవచ్చునని అనుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎవరు స్థల కేటాయింపులు పొందినప్పటికీ.. నిర్దిష్ట గడువులోగా నిర్మాణాలు పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం గడువులు నిర్దేశిస్తోంది. ఇప్పుడు వెంచర్ ఆలోచనను వారు మానుకున్నప్పటికీ.. స్టుడియోల నిర్మాణాన్ని మూడేళ్ల వ్యవధిలోగా పూర్తిచేయాలని కూడా ప్రభుత్వం గడువు విధించే అవకాశం ఉంది. మొత్తం కేటాయించిన 34.4 ఎకరాల్లో ఆధునిక స్టుడియోల నిర్మాణాలు అందుబాటులోకి వస్తే.. విశాఖపట్నంలో సినీ రంగం వేళ్లూనుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా పలువురు అంచనా వేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories