రాజ్యసభకు ఒకే ఒక్క ఎంపీ సీటుకోసం జరుగుతున్న ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడంలో.. భారతీయ జనతా పార్టీ విలువలు, సంయమనం పాటించింది. ఎంతోకాలంగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న, తొలినుంచి పార్టీ జెండా మోస్తున్న చిత్తశుద్ధి గల కార్యకర్తనే పదవికోసం ఎంపికచేసింది. ఈ ఎంపీ పదవికి భీమవరానికి చెందిన పార్టీ నాయకుడు, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పాక వెంకట సత్యనారాయణను ఎంపిక చేశారు. ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆయన ఎన్నిక కేవలం లాంఛనమే.
వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గతంలో గెలిచిన వేణుంబాక విజయసాయిరెడ్డి జనవరి 25న తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో.. ఈ ఖాళీ ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. బిజెపిలో చేరి ఆ స్థానాన్ని దక్కించుకుంటారనే ప్రచారం బాగా జరిగింది. కాదు కాదు.. ఆయన బిజెపిలో చేరుతారు కానీ.. ఎంపీ పదవి తీసుకోరు.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. విజయసాయిరెడ్డి కూడా వేర్వేరు సందర్భాల్లో తాను ఎంపీ పదవికోసం ప్రయత్నిస్తున్నట్టుగా వస్తున్న వార్తలను ఖండించారు. తాను రాజకీయాలనుంచి విరమించుకున్నానని, తిరిగి తాను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటే తప్పక వస్తానని, అందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్న ఎవ్వరి అనుమతిని తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని కూడా ఆయన అన్నారు.
అక్కడినుంచి ఇక బిజెపి తరఫున రాజ్యసభ ఎంపీ కాబోయేది ఎవ్వరు? అనే దిశగా ఊహగానాలు మొదలయ్యాయి. తమిళనాడులో మొన్నమొన్నటి దాకా పార్టీ అధ్యక్షుడిగా సేవలందించి.. ఆ పదవికి రాజీనామా చేసి.. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి మార్గం సుగమం చేసిన అన్నామలైను ఎపి నుంచి ఎంపీ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాకాకుండా స్మృతి ఇరానీని కూడా ఈ పదవికి పరిశీలిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. సందట్లో ఎమ్మార్పీఎస్ నాయకుడు మందక్రిష్ణ మాదిగ కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వారా హోంమంత్రి అమిత్ షాను కలిసి ఎంపీ పదవికోసం లాబీయింగ్ చేశారు. ఈ అన్ని రకాల కాంబినేషన్లను పక్కన పెట్టి.. కేవలం పార్టీని నమ్ముకుని తొలినుంచి సేవలందిస్తున్న, చిత్తశుద్ధి గల కార్యకర్త, స్థానికుడు అనే రెండు అంశాలే ప్రాతిపదికలుగా తాము పాక సత్యనారాయణను ఎంపికచేసింది కమలదళం.
పాక వెంకట సత్యనారాయణ గతంలో భీమవరంలో కౌన్సిలరుగా కూడా పనిచేశారు. పార్టీ భావజాలానికి ప్రతిరూపం అయిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అవే ఇప్పుడు పదవిని కట్టబెట్టాయనే ప్రచారం సర్వత్రా జరుగుతోంది.