పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ది రాజా సాబ్ కోసం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి హారర్ కామెడీ జానర్‌లో రూపొందిస్తున్నాడు. ప్రారంభంలో ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్నంత వేగంగా పూర్తవ్వడం లేదట. ఈ కారణంగా డిసెంబర్ 5 రిలీజ్ ప్లాన్ కుదరకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే, వచ్చే సంక్రాంతి సీజన్‌నే మేకర్స్ లక్ష్యంగా పెట్టుకోవాల్సి రావచ్చు.
ఈ లెక్కన చూస్తే, ది రాజా సాబ్ 2026 సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది నిజమవుతుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.