లిక్కర్ కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా సిట్ పోలీసులు ఆయనకు ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు. ఒకేఒక్కసారి మెయిల్ ద్వారా పెడసరపు సమాధానంతో స్పందించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. ఇప్పటిదాకా నోటీసులు స్వయంగా అందుకోవడానికి కూడా దొరకకుండా పరారీలోనే ఉన్నారు. సాక్షిగా విజయసాయిరెడ్డి సిట్ ఎదుటకు వచ్చి.. కుంభకోణంలో మొత్తం పాత్ర కసిరెడ్డిదే అని చెప్పి వెళ్లినందుకు ఆగ్రహించారు తప్ప.. కలుగులోంచి బయటకు రాలేదు. వసూళ్ల నెట్ వర్క్ నడిపించిన రాజ్ కసిరెడ్డి.. వసూలు చేసిందంతా ఎవరిచేతికి అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయో.. సదరు నేత ఎంపీ మిథున్ రెడ్డి కూడా విచారణకు వచ్చి వెళ్లారు. పరారీలో ఉన్న కారణంగా.. అందరి కళ్లు కసిరెడ్డి మీదనే పడుతున్నాయి. అందరి వేళ్లూ కసిరెడ్డివైపే చూపిస్తున్నాయి. ఈ కేసులో ఇంకా ఎంతోకాలం ఇలా దాక్కుని ఉండడం సాధ్యం కాదని, వేరే గత్యంతరం కూడా లేదని గ్రహించడంతో ఎట్టకేలకు రాజ్ కసిరెడ్డి సిట్ ఎదుటకు విచారణ నిమిత్తం రానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆడియో సందేశం ద్వారా ప్రకటించారు.
విజయసాయి సిట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో తనను పూర్తిగా ఇరికించి వెళ్లిన తర్వాత.. కొన్ని రోజుల్లో తాను కూడా బయటకు వచ్చి విజయసాయిరెడ్డి అవినీతి బాగోతాల చరిత్ర మొత్తం మీడియాకు చెబుతానని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో తాను కేవలం ఐటీ సలహాదారునని, లిక్కర్ స్కాం గురించి తనను ప్రశ్నించడంలో అర్థం లేదని సిట్ కు పెడసరపు సమాధానం మెయిల్ లో పంపిన రాజ్ కసిరెడ్డి అదే వాదనతో హైకోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిలు అడిగారు, అరెస్టునుంచి రక్షణ కావాలన్నారు. హైకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆ తర్వాత ఆయన సుప్రీంలో కూడా పిటిషన్ వేశారు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేయాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే సుప్రీలో అయినా ఊరట లభిస్తుందనే నమ్మకం కలగలేదని.. ఎప్పటికైనా హాజరు కాక తప్పదనే ఉద్దేశంతోనే రాజ్ కసిరెడ్డి విచారణకు రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో హాజరు అవుతానని ఆయన ఒక ఆడియో సందేశం విడుదల చేశారు. కాగా, మిథున్ రెడ్డి సిట్ ఎదుటకు వచ్చి వెళ్లిన తర్వాత రాజశేఖర రెడ్డికి కూడా కొంత ధైర్యం వచ్చి ఉండచ్చునని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే.. కసిరెడ్డికి నెక్ట్స్ లెవెల్ పాత్ర గా మిథున్ రెడ్డి పేరు వినిపించింది. ఆయనే పోలీసుల్ని తనకు సంబంధం లేదని దబాయించి.. అసలు తనకు సంబంధమే లేదని చెబుతుండగా.. ఇంకా డీటెయిల్స్ అడుగుతారేమిటి అని ఆగ్రహించి వెళ్లిపోయారు. తాను కూడా ఎటూ ఐటీ సలహాదారు గనుక.. తనకు సంబంధం లేదని కసిరెడ్డి అంటున్నారు. మిథున్ రెడ్డి లాగా ‘సంబంధం లేదనే’ ఒకే వాదనకు కట్టుబడి మొండిగా ఉంటే పోలీసులు ఏమీ చేయలేరు అనే విశ్వాసంతో విచారణకు వస్తున్నట్టుగా తెలుస్తోంది.