చిత్ర విచిత్ర వాదనలతో రాజ్ కెసిరెడ్డి డ్రామాలు

చిత్ర విచిత్రమైన వాదనలు లేవనెత్తితే.. తాను చేసిన పాపాన్ని నిర్ధరించడంలో ఆలస్యం జరుగుతుందని ఆశపడుతున్నట్టుగా ఉంది.. పాపం రాజ్ కెసిరెడ్డి. మూడున్నర వేల కోట్లరూపాయలను, డిస్టిలరీలను బెదిరించి వసూలు చేయడంలో అంతా తానే అయి వసూళ్ల నెట్ వర్క్ ను నడిపించడంతో పాటు, వసూలైన సొమ్ములను జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులు, విశ్వసనీయులైన వ్యక్తులకు చేరవేయడం.. వారు చెప్పినట్టుగా పెట్టుబడులు పెట్టడం, దాచిపెట్టడం వంటి పనులు చేసిన రాజ్ కెసిరెడ్డి.. ఇప్పుడు తన అక్రమాలను దాచిన డంప్ నుంచి 11 కోట్ల రూపాయలు పోలీసులకు దొరికిపోయే సరికి.. కొత్త పాట ఎత్తుకుంటున్నారు. ఆ డబ్బుతో అసలు తనకు సంబంధమే లేదని అంటున్నారు. ఆ డబ్బు తనదో కాదో తేల్చడానికి ఆయన కోర్టుకు పెడుతున్న కండిషన్లను గమనిస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది.

శంషాబాద్ మండలంలోని ఫాంహౌస్ లో 11 కోట్ల రూపాయలను సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ కెసిరెడ్డి ముఖ్య అనుచరుడు వరుణ్ పురుషోత్తంను అరెస్టు చేసిన వెంటనే అతను ఇచ్చిన సమాచారంతోనే ఈ డంప్ పై దాడిచేసి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫాం హౌస్ రాజ్ కెసిరెడ్డి వ్యాపార భాగస్వామి విజయేందర్ రెడ్డిది.

డబ్బు దొరికిన వెంటనే.. ఆ డబ్బు తనది కాదని.. విజయేందర్ రెడ్డికి బోలెడు వ్యాపారాలు ఉన్నాయని, వందల కోట్ల టర్నోవర్ తో వ్యాపారాలు చేస్తుంటారని, అవి ఆయన డబ్బులే అయి ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ మేరకు ఆయన కోర్టులో ఒక అఫిడవిట్ కూడా వేశారు. ఆ డబ్బుతో తనకు ముడిపెట్టవద్దని కోరారు. తాజాగా మళ్లీ ఆయన కోర్టులో ఇదే వాదనలు వినిపించారు. ఎక్కడ డబ్బు దొరికినా మద్యం సొమ్ము అంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆ డబ్బు తాను వరుణ్ కు ఇచ్చినట్టు చెబుతున్నారు గనుక.. ఆ మాట నిజమైతే ఆ డబ్బుపై తన వేలిముద్రలు ఉండాలని వాటిని చెక్ చేయాలని రాజ్ కెసిరెడ్డి కోరుతున్నారు. అంటే ఏమిటన్నమాట.. 12 డబ్బాల్లో ఉన్న 11 కోట్ల రూపాయల విలువైన రూ.500 నోట్ల మీద.. రాజ్ కెసిరెడ్డి వేలి ముద్రలు ఉన్నాయో లేదో జాగ్రత్తగా పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలు చేయించాలన్నమాట. ఇది అసలు సాధ్యమయ్యే పనేనా? అయినా.. లంచాలుగా డిస్టిలరీల నుంచి పుచ్చుకున్న సొమ్మును అనుచరుడికి దాచడం కోసం యివ్వడం అంటే.. ప్రతి నోటును చేత్తో ముట్టుకుని మరీ ఇవ్వరు కదా.. అనేది ప్రజల అనుమానం.
2024 జూన్ లో ఆ డబ్బును వరుణ్ కు ఇచ్చినట్టుగా చెబుతున్నారని.. ఆ నోట్లపై ఉన్న నెంబర్లను రికార్డు చేసి.. అవి ఎప్పుడు ప్రింట్ అయ్యాయో చెక్ చేయాలని రాజ్ సవాలు విసురుతున్నారు. అయినా డిస్టిలరీ నుంచి పుచ్చుకున్నది నిజమా కాదా.. ఆ డబ్బు తరలించినది నిజమా కాదా? అనేదే ముఖ్యం తప్ప అదే నోట్లనెంబర్లు, వాటి మీద వేలి ముద్రలు ఇవన్నీ కేవలం బుకాయించడం కోసం మాత్రమేనని జనం అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories