తన ప్రత్యర్థి కోసం రఘురామ ప్రార్థనలు!

ప్రస్తుతం డిప్యూటీ స్పీకరుగా ఉన్న రఘురామక్రిష్ణ రాజు.. తాను ఎవరి మీదనైతే కేసులు పెట్టారో వారిలో ఒకరికోసం ఇప్పుడు దేవుడిని ప్రార్థిస్తున్నారు. తమాషాగా అనిపించినా ఇది నిజం. ఎలాగంటే.. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు.. రఘురామక్రిష్ణ రాజు మీద రాజద్రోహం నేరం ఆపాదించి.. జగన్ సర్కారు తీవ్రస్థాయిలో వేధించిన సంగతి తెలిసిందే. సీఐడీ కస్టడీలోకి తీసుకుని ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. దానిమీద ప్రస్తుతం పోలీసు కేసు నడుస్తోంది. ఆ కేసులో ఒక నిందితురాలు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పోలీసుల విచారణలో తనకేమీ గుర్తులేదని, ఫైల్స్ చూస్తే తప్ప ఏమీ చెప్పలేనని, తన చేతికి వచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టానే తప్ప.. తనకేమీ తెలియదని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామక్రిష్ణరాజు మాత్రం.. ఆమెకు తిరిగి జ్ఞాపకశక్తి రావాలని, మంచిగా ఉన్నది ఉన్నట్టు, జరిగినది జరిగినట్టు చెప్పే శక్తి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రఘురామక్రిష్ణ రాజు అంటున్నారు.

తెలియదు.. గుర్తులేదు.. గాయాలు ఎలా ఉంటాయో తెలియదు.. వాటిపై అవగాహన లేదు.. అంటూ ఒక ఎంబీబీఎస్ డాక్టరు అయిన ఆస్పత్రి సూపరింటెండెంటు ప్రకటించడం చూస్తే ఆమె బుద్ధి, ప్రవర్తన అర్థమివుతుందంటూ.. రఘురామ ఎద్దేవా చేస్తున్నారు. ఆమె సుప్రీంకోర్టులో అరెస్టు నుంచి రక్షణ కల్పించే ఉత్తర్వులు వచ్చేవరకు ఎవ్వరి కంట పడకుండా పరారీలో ఉన్న సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు.
రఘురామ వైసీపీ ఎంపీగా ఉన్న రోజుల్లో జగన్ ప్రభుత్వపు వైఫల్యాల మీద రచ్చ బండ కార్యక్రమం ద్వారా వరుస విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిని సహించలేకపోయిన జగన్.. ఆయన మీద రాజద్రోహం కేసులు పెట్టించి.. సీఐడీ తో అరెస్టు చేయించారు. సీఐడీ కస్టడీలో దారుణంగా కొట్టి హింసించారు. గాయాలతో ఆయనను గుంటూరు జీజీహెచ్ కు తీసుకువెళితే.. డాక్టర్లు ఇచ్చిన నివేదికలను మార్పించి, గాయాలు లేవన్నట్టుగా తప్పుడు రిపోర్టులు ఇచ్చినంట్టు అప్పటి సూపరింటెండెంటు ప్రభావతి మీద ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత.. తన మీద జరిగిన హత్యాయత్నం గురించి రఘురామ ఫిర్యాదుచేశారు.

అప్పటి సీఎం జగన్ తొలినిందితుడు కాగా, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంటు ప్రభావతి తదితరులు ఈ కేసులో ఉన్నారు. విచారణ మొదలై ఇప్పటికే కొందరు పోలీసు అధికారుల్ని అరెస్టు చేయడం, విచారించడం కూడా జరిగింది. అయితే అప్పటినుంచి పరారీలో ఉండి, సుప్రీం కోర్టు ద్వారా రక్షణ పొందిన డాక్టరు ప్రభావతి ఇప్పుడు విచారణకు హాజరై తనకేమీ గుర్తులేదనడంపై రఘురామ ఎద్దేవా చేస్తున్నారు. ఆమె జ్ఞాపకశక్తికోసం దేవుడిని ప్రార్థిస్తాననడమే తమాషా!

Related Posts

Comments

spot_img

Recent Stories