పశ్చిమగోదావరి జిల్లాలో సీట్లు ఖాళీ లేవు. అక్కడ తెలుగుదేశం పార్టీకి దక్కిన అన్నిస్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశారు. ఎవరికి వారు ప్రచారంలో మునిగిఉన్నారు కూడా. కానీ.. ఎవరో ఒకరికి సర్దిచెప్పి మార్చడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే జరిగే అవకాశం కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటినుంచి కూడా.. జగన్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేసి..
నిర్భయంగా తన సునిశితమైన విమర్శలతో ఆ పార్టీని నాలుగేళ్లపాటూ ముప్పతిప్పలు పెట్టిన ఫైర్ బ్రాండ్ రఘురామక్రిష్ణ రాజును అసెంబ్లీ బరిలోకి దింపాలని తెలుగుదేశం భావిస్తోంది.
రఘురామక్రిష్ణ రాజు.. నరసాపురం ఎంపీగా బరిలో ఉంటారని అంతా అనుకున్నారు. నిజానికి ఆయన కూడా ఏ పార్టీ అనేది కూటమి- సీట్ల పంపకాల తర్వాత చెప్తాను గానీ.. నరసాపురం ఎంపీగా మళ్లీ పోటీచేయబోయేది మాత్రం గ్యారంటీ అని పలుసందర్భాల్లో వెల్లడించారు. నరసాపురం సీటు వాటాల్లో బిజెపికి దక్కింది. రఘురామకోసమే ఆ పార్టీ ఆ సీటును తీసుకుంది అనే ప్రచారం కూడా జరిగింది. అంత స్థాయిలో ఆ పార్టీ అగ్రనేతలతో రఘురామకి సత్సంబంధాలు ఉండడమే అందుకు కారణం. ఢిల్లీ వర్గాల్లో తన ముద్ర, గట్టి పరిచయాలు ఉన్న రఘురామ కు ఎంపీ అభ్యర్థి టికెట్ గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ నరసాపురం భూపతిరాజు శ్రీనివాసవర్మకు బిజెపి టికెట్ కేటాయించింది. రఘురామకు టికెట్ దక్కలేదని వైసీపీ వర్గాలు సంబరపడ్డాయి.
అయితే ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపి టికెట్ దక్కకపోయిన తర్వాత.. తాను చంద్రబాబుతోనే ఉంటానని, తెలుగుదేశం రాజకీయాల్లోనే ప్రజాక్షేత్రంలో పోటీచేస్తానని రఘురామ ప్రకటించారు. ఆ మాటల వెనుక గూఢార్థం.. ఆయన పశ్చిమగోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేయబోతున్నట్టుగా ఇప్పుడు అర్థమవుతోంది.
ఈ జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులు ఆల్రెడీ ఫైనల్ అయ్యారు. అయినా సరే వారిలో ఒకరికి నచ్చజెప్పి రఘురామను ఎమ్మెల్యే బరిలో దించుతారని ప్రచారం జరుగుతోంది. రఘురామ అసెంబ్లీలో ఉంటే ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగానే చుక్కలు చూపిస్తారనే ఆశ కూడా ఆయన అభిమానుల్లో ఉంది. అయితే రఘురామ కోసం తమ సీటు త్యాగం చేసే వారు ఎవరుంటారా? అనే చర్చ ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా నాయకుల్లో జరుగుతోంది.