ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజుకు కాస్త ఉత్సాహం కలిగించే తీర్పు సోమవారం నాడు సుప్రీం కోర్టు వెలువరించింది. గత ప్రభుత్వ పాలన కాలంలో.. రాజద్రోహ నేరం కింద తనను సీఐడీ అరెస్టు చేసినప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో పోలీసు అధికారులు తనమీద హత్యాయత్నం చేశారని కేసు పెట్టారు. ఆ కేసు త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఇప్పుడు రఘురామలో ఆశలు చిగురిస్తున్నాయి. అప్పట్లో రఘురామక్రిష్ణ రాజును కస్టోడియల్ టార్చర్ కు గురిచేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడు విజయపాల్.. బెయిలు కోసం పెట్టుకున్న పిటిషను నుు సుప్రీం కోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. త్వరలోనే పెద్దచేపలు కూడా బయటకు వస్తాయని రఘురామ అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి కొద్ది కాలానికే ఆయన పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామక్రిష్ణ రాజు వారితో విభేదించారు. అప్పటినుంచి ప్రభుత్వ నిర్ణయాల్లో తనకు ఏ లోపాలు కనిపించినా వాటిని నిశితంగా విమర్శిస్తూ యూట్యూబ్ చానెల్లో వీడియోలు పెడుతూ చెలరేగిపోయారు. ఆయన పెడుతున్న వీడియోలు ప్రశ్నిస్తున్న తీరు.. ఒక దశలో ప్రభుత్వానికి కునుకు లేకుండా చేశాయంటే నమ్మవచ్చు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదుచేసి ఆయనమీద అనర్హత వేటు వేయించడానికి అవకాశం ఇవ్వకుండా ఆయనచాలా టెక్నికల్ గా తెలివిగా వ్యవహరించేవారు.
ఒకవైపు ఆయన మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతమైన హామీలు ఇచ్చారు- అని అంటారు. అదే సమయంలో.. ఈ ప్రభుత్వంలో సీఎం జగన్ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు- అని అంటారు. ఇలా టంగ్ ట్విస్టర్ లాగా వైసీపీ నేతలు అధికారికంగా చర్యలు తీసుకోవడానికి కొరుకుడుపడకుండా ప్రభుత్వాన్ని తన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తీరా ఆయన మీద రాజద్రోహం కేసు బనాయించి.. సీఐడీ పోలీసులు హైదరాబాదనుంచి అరెస్టు చేసి తీసుకువచ్చారు. కస్టడీలో తీవ్రంగా హింసించారని ఆయన కోర్టుకు నివేదించుకుని బెయిలు పొందారు.
తీరా ప్రభుత్వం మారిన తర్వాత జగన్ ప్రోద్బలంతో తన మీద పోలీసులు హత్యాయత్నం చేశారంటూ కేసు పెట్టారు. ఆ కేసు విచారణలో అప్పటి ఏఎస్పీ విజయపాల్ ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంకా పెద్దచేపలు త్వరలో బయటకు వస్తాయని రఘురామ అనడం గమనిస్తే.. ఈ కేసులో జగన్ కు కూడా త్వరలోనే నోటీసులు వెళతాయని అర్థమవుతోంది.