క్విడ్ ప్రోకో దందాల పుణ్యమే.. కూల్చివేతల పర్వం!

క్విడ్ ప్రోకో అనే పదాన్ని జనసామాన్యంలోకి విస్తృతంగా తీసుకువెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ‘నీకు అది- నాకు ఇది’ అనే సూత్రాన్ని ఎన్నిరకాలుగా, ఎన్నెన్ని వ్యాపారాల్లోకి విస్తరింపజేయవచ్చునో, రాజకీయాన్ని కూడా ఆ సూత్రం కిందికి ఎలా తీసుకురావచ్చునో, రాజకీయ అవినీతికి ఆ సూత్రంతో ఎలా ముసుగు వేయవచ్చునో జగన్మోహన్ రెడ్డి తన వ్యవహారసరళి ద్వారా గతంలో గొప్పగా నిరూపించారు. అదే దందాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంలో కూడా కొనసాగించడం వలన.. ఇప్పుడు కూల్చివేతల దాకా పరిస్థితి వచ్చిందనే విశ్లేషణలు అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఎలాగంటే.

పార్టీకోసం జిల్లా కార్యాలయాలు నిర్మించుకోవడానికి ప్రతిచోటా సుమారుగా రెండేసి ఎకరాల ప్రభుత్వ భూమిని వెయ్యిరూపాయల నామమాత్రపు మొత్తానికి 33  ఏళ్ల లీజుకు తీసుకునేలా జగన్ ప్రభుత్వంలో నిర్ణయించేశారు. ప్రభుత్వానికి లీజు మొత్తం పార్టీ చెల్లిస్తుంది. నిజానికి లీజు ప్రక్రియ కూడా చాలా జిల్లాల్లో పూర్తి కాలేదని వార్తలు వస్తున్నాయి.

అయితే ఆయా స్థలాల్లో పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం అనేది వేరే వ్యవహారం. సహజంగా, ప్లాను చేతిలో పెట్టి, ఆమేరకు కట్టాలంటూ కాంట్రాక్టర్లను పురమాయించేస్తారు. ఆ కాంట్రాక్టర్లందరూ కూడా జగన్ ప్రభుత్వం ద్వారా అడ్డదారుల్లో అత్యధికంగా లబ్ధి పొందనే వారే ననే పుకార్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇతరత్రా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వారికి ఇబ్బడి ముబ్బడిగా దోచిపెట్టేసి.. ఆ అనుచిత లబ్ధి చేసినందుకు గాను.. తమకు పార్టీ కార్యాలయం కట్టించి ఇవ్వాలని పురమాయించిన కేసులే అధికం అని అంటున్నారు. సో, ఆ కాంట్రాక్టర్లు అందరూ తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి మొత్తం పొందేశారు గనుక.. లేదా లబ్ధి పొందడానికి డీల్ కుదుర్చుకున్నారు గనుక.. దానికి ఇబ్బంది రాకుండా.. నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. ప్లాన్ లకు అనుమతులు ఉన్నాయా లేదా అనేది వారు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఆ పార్టీ వారిదే కదా.. అనుమతుల గురించి ఆగేదేముందిలే అని సదరు కాంట్రాక్టర్లు అనుకున్నారు. కడుతున్నది అధికార పార్టీ వారి కార్యాలయం గనుక.. అనుమతులు ఇచ్చేదాకా నిర్మాణం ఆపాలని చెప్పే ధైర్యం అధికారులూ చేయలేదు.

పర్యవసానంగా ఇప్పుడు కూల్చివేతలు, నోటీసులు జరుగుతున్నాయి. క్విడ్ ప్రోకో దందాలలో భాగంగా అనుమతులను పట్టించుకోకుండా చెలరేగిపోవడం వల్లనే ఆ పార్టీకి ఇప్పుడు ఈ ఇబ్బందులు వస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories