క్యూ కట్టి నిష్క్రమిస్తున్న గులాబీ నాయకులు!

అధికారాంతమునందు చూడవలె అయగారి వైభోగముల్ అంటారు పెద్దలు. అధికారంలో ఉన్నప్పుడు బెల్లం చుట్టూ మూగే ఈగల్లాగా చుట్టూ ఎందరైనా చేరవచ్చు గాక.. ఆశ్రితులుగా భృత్యులుగా కేసీఆర్ ను సేవించుకుని ఉండవచ్చు గాక..! కానీ.. పదేళ్ల అధికార వైభవం తరువాత ఒకసారి ఎన్నికల్లో ఓడిపోగానే.. ఆయన పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇన్నాళ్లూ ఆ పార్టీలో ఉన్న నాయకులు రోజురోజుకూ ఆ పార్టీని వదలి వెళ్లిపోతున్నారు. పార్టీ టికెట్లు ఇస్తాం అంటే వద్దని అంటున్నారు. టికెట్లు ఇచ్చిన తర్వాత, టికెట్లు ప్రకటన పూర్తయిన కొన్ని రోజుల తర్వాత.. ‘తూచ్ ఈ టికెట్ మాకొద్దు’ అని వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలు చూస్తోంటే గులాబీ దళానికి భవిష్యత్తు లేదా అనే సందేహం కలుగుతోంది.

గురువారం నాడు భారాస రాజకీయాల్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ తన పార్టీలో ఎంతో గౌరవంగా చూసుకుంటూ వచ్చిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు 84 ఏళ్ల కె కేశవరావు కూతురుతో కలిసి పార్టీని వీడి కాంగ్రెసులో చేరడానికి నిర్ణయించుకున్నరు. స్వయంగా కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లి, ఆయనతో చెప్పి, కాస్త ఆయన ఆగ్రహాన్ని కూడా చవిచూసి పార్టీనుంచి నిష్క్రమణను ధ్రువీకరించారు. ఎంతో కాలం కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నానని, ఈ వయసులో తిరిగి మాతృసంస్థకు వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు. పార్టీకి అదొక పెద్ద దెబ్బ అయితే.. వరంగల్ ఎంపీ నియోజకవర్గ రాజకీయం మరొక పెద్ద దెబ్బ.

అక్కడినుంచి పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన కడియం కావ్య.. తాను వరంగల్ నుంచి పోటీచేయడం లేదని ప్రకటించారు. మాజీ మంత్రి, ప్రస్తుతం భారాస ఎమ్మెల్యే కూడా అయిన కడియం శ్రీహరి కూతురే కావ్య. వరంగల్ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కావ్య ఆ పార్టీలో ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇత్యాది విషయాలతో పార్టీ భ్రష్టు పట్టిపోయిందని కూడా కావ్య నింద వేశారు. మొత్తానికి కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఇద్దరూ కూడా భారత రాష్ట్ర సమితిని వీడిపోతున్నట్టుగా ప్రకటించారు. శుక్రవారం వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కేకే, ఆయన కూతురు శనివారం నాడు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

హఠాత్తుగా భారాస గ్రాఫ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది,. తెలంగాణ జాతిపితగా తనను ప్రకటింపజేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితి మరీ దయనీయంగా తయారైపోయిందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories