సజ్జలకు ప్రశ్నలు : కార్యకర్తలకు మనమేం చేస్తున్నాం సార్!

‘‘వైఎస్సార్ సీపీ ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి. ప్రజల సమస్యలపై ప్రజల పక్షా నిలబడాలి.. ప్రభుత్వాన్ని నిలదీయాలి.. ప్రజల గొంతుకగా మనం నిలబడాలి..’’ ఈ డైలాగులు అన్నీ ఓకే. మరి మనం కార్యకర్తలకోసం ఏమైనా చేస్తున్నామా? లేదా? కార్యకర్తలకు అండగా ఉండేందుకు, ఏదైనా పథకం ఉన్నదా లేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా స్థాయి సారథులు, నేతలు హైకమాండ్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను.. పార్టీకోసం పోరాడాలని ప్రేరణ ఇవ్వడం బాగానే ఉంది.. మరి ఆ కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ఏం చేస్తుందని చెప్పి.. వారిని ఆకర్షించాలి అని అడుగుతున్నారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులతో సజ్జల రామక్రిష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. అయితే.. ఆయనను విడిగా కలిసిన పార్టీ నేతలు.. కేడర్ కోసం పార్టీ కార్యచరణ ఏమైనా ఉంటుందా? లేదా? అని అడిగినట్టుగా తెలుస్తోంది.

పార్టీ జిల్లాల ప్రధాన కార్యదర్శులతో, ఎంతో కీలకంగా అభివర్ణిస్తున్న, ఈ సమావేశంలో పాల్గొనడానికి కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమయం లేకపోవడం.. జిల్లా నాయకులకు అసంతృప్తి కలిగించినట్టు సమాచారం. ఈ సమావేశానికి సజ్జల నేతృత్వం వహించారు. వైసీపీ పునాదులను మరింత బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన కార్యదర్శులకు ఆయన పిలుపు ఇచ్చారు. మీరంతా పార్టీకి కమాండర్ ల లాంటి వాళ్లని ఆయన వారికి ఉత్సాహం ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయితే పార్టీ గురించి జిల్లా స్థాయి నాయకుల్లోనే రకరకాల అపోహలు, అనుమానాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. తెలుగుదేశం, జనసేన పార్టీల్లో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి బీమా వర్తిస్తుంది. వారు వ్యక్తిగతంగా ఏదైనా ప్రమాద వశాత్తూ మరణించినా కూడా.. వారికి కనీసం అయిదు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. నిజం చెప్పాలంటే.. గ్రామాల స్థాయిలో కాస్తంత రాజకీయ ఆసక్తి ఉండేవాళ్లు ఏదో ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని అనుకుంటే గనుక.. వారికి ఈ ప్రమాదబీమా అనేది ఒక ఆకర్షణీయ అంశంగానే కనిపిస్తోంది. గతంలో రెంటపాళ్లలో జగన్ పర్యటించినప్పుడు.. వివాదాస్పద ‘రప్పా రప్పా నరుకుతాం’ ఫ్లెక్సిలను ప్రదర్శించిన జగన్ అభిమాని కూడా తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కేవలం బీమా వంటి ఫెసిలిటీస్ పొందడం కోసమే ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టుగా తేలిందని.. ఇది తమ పార్టీకి సిగ్గు చేటు అని కొందరు జిల్లా ప్రధాన కార్యదర్శులు సజ్జల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.
పార్టీ మీద అభిమానం పెరిగేలా కార్యకర్తలకు పార్టీ తరఫున ఏదో ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నదని వారు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ తీరు గానీ, జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి గానీ తెలియని వారే ఇలాంటి ఆశలు పెట్టుకుంటున్నారని.. జగన్ తన 2.0 సర్కారు వస్తే.. మిమ్మల్ని వేధించిన వారినందరినీ మనం కూడా వేధిద్దాం అని చెప్పడం తప్ప.. రాబోయే నాలుగేళ్ల పాటు పార్టీ కార్యకర్తలు బతికి బట్టకట్టడానికి ప్రకటించిన హామీ ఒక్కటి కూడా లేదు.. అని పార్టీలో అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories