రాంగోపాల్ వర్మ నోటికి అదుపులేకుండా మాట్లాడడంలో పేరుమోసిన వ్యక్తి. కానీ… పోకిరి సినిమాలో డైలాగు మాదిరిగా.. ఆయనకు ఇప్పటిదాకా కరెక్టు వ్యక్తి తగల్లేదు గనుక.. ఇన్నాళ్లూ చెలరేగిపోతూ వచ్చారు. ఇప్పుడు ఆయన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ప్రతి చోట నుంచి ఆయనకు నోటీసులు అందుతున్నాయి. ప్రతిచోటకు విచారణకు వెళ్లకుండా డుమ్మా కొడుతున్నారు. కొన్నిచోట్ల రావడానికి టైం కావాలని అడుగుతున్నారు. కొన్నిచోట్లకు న్యాయవాదుల్ని పంపుతున్నారు. పైకి ఎంత బింకంగా కనిపిస్తున్నప్పటికీ.. రాంగోపాల్ వర్మ అరెస్టు భయంతో వణికిపోతున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఆయన హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషనే అందుకు తార్కాణం.
వ్యూహం సినిమా నేపథ్యంలో దాని ప్రమోషన్ కోసం.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసిన తన సోషల్ మీడియా ఖాతాల్లో వికృత అసహ్యకరమైన పోస్టులు పెట్టారు వర్మ. ఆ పోస్టులు సినిమా ప్రమోషన్ కు కలిసి వస్తాయని అనుకున్నారు. కానీ.. ఆ సినిమాను వైసీపీ కార్యకర్తలు కూడా చూడకుండా అసహ్యించుకున్నారు. లాభం జరగలేదు గానీ.. ఆ పోస్టుల పాపాలు మిగిలిపోయాయి. సోషల్ మీడియా సైకోల మీద కొరడా ఝుళిపిస్తున్న ఈ తరుణంలో రాంగోపాల్ వర్మ మీద పోలీసు కేసులు నమోదు అయ్యాయి. మద్దిపాడులో నమోదు అయిన కేసుకు సంబంధించి.. ఆయన ఆ కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు దానిని తిరస్కరించింది.
విచారణకు హాజరు కాకుండా సమయం అడిగిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ముందస్తు బెయిలుకోసం మరో పిటిషన్ వేశారు. పోలీసులు తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉన్నదని ఆయన అందులో పేర్కొన్నారు. అయితే.. ఇలాంటి ఊహాజనితమైన భయాలతో.. నాకు బెయిలు కావాలని కోరితే.. కోర్టు అనుమతిస్తుందని అనుకోవడం భ్రమ. సోషల్ మీడియా కేసులకు సంబంధించి పలు కేసుల్లో ముందస్తు బెయిలు పిటిషన్లు హైకోర్టులో తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి వర్మలో ఇప్పుడు అరెస్టు భయం బాగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.