ఒకే రకమైన నేరాన్ని ఇతరుల పట్ల చేస్తూ ఉంటే మనం చూసే వైఖరికి, మనపట్ల ఎవరైనా చేసినప్పుడు మనం స్పందించే వైఖరికి చాలా తేడా ఉంటుంది. అందుకే తనదాకా వస్తేగానీ తెలియదు.. అనే సామెత పుట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సోషల్ మీడియా దళాలు చేస్తున్న దురాగతలు, చేస్తున్న అబద్ధపు ప్రచారాలు ఇన్నాళ్లుగా ఎలా సాగుతున్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోని వారు కూడా ఇప్పుడు తమ దాకా వచ్చేసరికి స్పందిస్తున్నారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారం వెలికివచ్చిన నేపథ్యంలో.. బిజెపి రాష్ట్ర సారధి దగ్గుబాటి పురందేశ్వరి తన పదవికి రాజీనామా చేసినట్లుగా ఒక లేఖ సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది.
ఆ లేఖ మీద ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీరియస్ అవుతోంది. నకిలీ లేఖ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ విజయవాడలోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ లెటర్ హెడ్, నకిలీ సంతకంతో లేఖను సృష్టించారని, ఇదంతా వైకాపా సోషల్ మీడియా వారి పనేనని ఆయన ఆరోపిస్తున్నారు. వ్యవహారం ఫోర్జరీ మరియు బిజెపికి చెందినది కావడంతో పోలీసులు కూడా స్పందించే అవకాశం ఉంది.
విషయం ఏంటంటే.. డ్రైడ్ ఈస్ట్ తో కూడిన కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖకు చేరుకున్నప్పటినుంచి రాష్ట్రంలో సంచలనం రేగుతోంది. అందులో లక్ష్లల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కూడా ఉన్నట్టు తేలడంతో.. సీబీఐ పూర్తిస్థాయి విచారణ జరుపుతోంది. అదే సమయంలో.. ఆ కంటైనర్ ను తెప్పించిన సంధ్యా ఆక్వా యజమాని వీరభద్రరావు సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం కూడా సంచలనాంశం అవుతోంది. తమ మీదినుంచి అనుమానాలను పక్కకు మళ్లించేందుకు వైసీపీ దళాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే.. దగ్గుబాటి పురందేశ్వరి కొడుకుకు, సంధ్యా ఆక్వా యజమాని కొడుకుతో సంబంధం ఉన్నదని, పురందేశ్వరి వియ్యంకులతో సంధ్యాఆక్వా యజమానికి వ్యాపార భాగస్వామ్య సంబంధాలున్నాయని ఆరోపించారు.
అందువల్ల పురందేశ్వరి కుటుంబానికి కూడా ఈ డ్రగ్స్ దిగుమతితో సంబంధం ఉందని ఆరోపణలు చేశారు.
ఈ డ్రగ్స్ దందాలో తన పేరు బయటకు రావడం వలన పురందేశ్వరి మనస్తాపం చెంది రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టుగా లేఖను సృష్టించారు. అదే ఇప్పుడు వివాదం అవుతోంది. బిజెపి పెద్దలు కూడా సీరియస్ అయితే.. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సృష్టించే వైకాపా సోషల్ మీడియా వారి భరతం పడతారనే ప్రచారం జరుగుతోంది.