వెంకన్న సొమ్మును దిగమింగడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకోచించలేదు. తాము రాజకీయంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎదగడానికి దేవుడి సొమ్మును అడ్డదారుల్లో తమ స్వార్థం కోసం, ప్రజాప్రయోజనాల ముసుగు వేసి వాడుకోవడానికి వారు అస్సలు భయపడలేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అనేక అవినీతి అరాచక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తోంది. అప్పట్లో ఇంచార్జి ఈవోగా వ్యవహరించిన అదనపు ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ గా వ్యవహరించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. వారికి ముందు ఆ పదవులలో ఉండినటువంటి జవహర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అందరూ కూడా తమ పాపాలకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లుగా కనిపిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో కాంట్రాక్టు పనులకు కేటాయించిన డబ్బుల్లో వాటాలు దిగమింగడం, దేవస్థానానికి లభించే నిధులను దారి మళ్ళించడం తదితర ఆరోపణలకు సంబంధించి విజిలెన్స్ విచారణ తుది దశకు చేరుకుంది. రెండు నెలలుగా విజిలెన్స్ అధికారులు ఐదేళ్లలో టీటీడీ వివిధ విభాగాలలో జరిగిన లావాదేవీల పై వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమించి చేసిన పనులు, అక్రమ వ్యవహారాల ఆరా తీశారు. ఈ మేరకు అప్పట్లో చైర్మన్గా పనిచేసిన వారికి, ఈవోలుగా పనిచేసిన వారికి కూడా నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఏడాదికి 300 కోట్ల రూపాయల వరకు టీటీడీ ఇంజనీరింగ్ పనుల మీద ఖర్చు పెడుతూ ఉంటుంది. ఈ కాంట్రాక్టులో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగా టీటీడీ డబ్బులను తిరుపతి అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా ఖర్చు చేయించారు. తన కొడుకు, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డినిఎమ్మెల్యేగా చేయడానికి వీలుగా తిరుపతిలో పనుల కోసం దేవుడి సొమ్మును విచ్చలవిడిగా తగలేశారు. టీటీడీ బడ్జెట్లో ఏడాదికి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలని, జగన్ కళ్ళలో ఆనందం చూడడం కోసం ప్రతిపాదించి భూమన కరుణాకర్ రెడ్డి వివాదాస్పద వ్యక్తి అయ్యారు.. అప్పుడు వచ్చిన విమర్శలకు భయపడి ప్రభుత్వమే తమకు ఆ సొమ్ము వద్దని టీటీడీ కి లేఖ రాసి వదిలించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ స్థాయిలో వారందరూ కూడా ఐదేళ్లపాటు విచ్చలవిడిగా వ్యవహరించారు. ఇప్పుడు అన్ని అక్రమాలపై నివేదిక సిద్ధం అవుతుంది.
దేవుడిని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేసిన వారికి కేవలం శిక్షలు వేసి ఊరుకుంటే సరిపోదని.. వారి నుంచి దిగమింగిన వందల వేల కోట్ల రూపాయల కూడా వెనక్కు కక్కించాలని ప్రజలు కోరుకుంటున్నారు.