పీఎస్సార్ : ఇది నిరుద్యోగ జాతికి చేసిన ద్రోహం!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రభుత్వాధినేత గనుక.. ఆయన ప్రాపకం సంపాదిస్తే ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని కక్కుర్తి పడి.. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ, ఆయన ఆదేశాలను శిరసావహిస్తూ అడ్డదారులు తొక్కడంలో అర్థం ఉంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపిక కావాల్సిన వందల మంది నిరుద్యోగుల జీవితాలతో, భవిష్యత్ ఆశలతో ఆటలాడుకుంటూ.. దుర్మార్గానికి పాల్పడడం వెనుక ఆయన ఉద్దేశ్యాలను ఎలా అర్థం చేసుకోవాలో కూడా బోధపడడం లేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినప్పుడు.. అరాచకత్వానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఐపీఎస్ అధికారి, దానికి ముందు.. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు కూడా తనదైన ముద్రతో అక్రమాలకు పాల్పడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడంలో అనేక అడ్డదారులు తొక్కారు.

జగన్ హయాంలో గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. అప్పట్లో పీఎస్సార్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ఒత్తిళ్లకు తలొగ్గి.. మూల్యాంకనంలో స్వయంగా అక్రమాలు చేయించారనే విమర్శలు దండిగా వచ్చాయి. 2021 ఏప్రిల్ లో ఆయన డిజిటల్ మూల్యాంకన ఫలితాలు వెల్లడించారు. నోటిఫికేషన్ లో పేర్కొనకుండా.. డిజిటల్ విధానం అనుసరించడం కరెక్టు కాదంటూ.. అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేయడంతో.. మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేయించాలని న్యాయస్థానం విస్పష్టంగా తీర్పు చెప్పింది. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన ఫలితాలు సరైనవే అనే భ్రమ కలిగించడానికి పీఎస్సార్ పెద్ద డ్రామానే నడిపించారు. మాన్యువల్ మూల్యాంకనం అనేది 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి వరకు హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో జరిగేలా రంగం సిద్ధం చేశారు. నిజానికి ఇలా ప్రెవేటు రిసార్ట్స్ లో చేయించడం నిబంధనలకు విరుద్ధం అయినా ఆయన పట్టించుకోలేదు. పైగా ఈ మాన్యువల్ మూల్యాంకనం చేయించే బాధ్యత మొత్తాన్ని ఒక ప్రెవేటు మీడియా కంపెనీకి అడ్డగోలుగా కాంట్రాక్టు ఇచ్చారు. క్యామ్ సైన్ అనే సంస్థకు ఇందుకోసం 1.14 కోట్ల రూపాయలు చెల్లించారు. వారు ఖర్చు పెట్టింది 40 లక్షలు కూడా లేకపోయినప్పటికీ.. తాను చెప్పినట్టు ఆడడానికి వారికి ఈ మొత్తాన్ని అందజేశారు. మాన్యువల్ మూల్యాంకనానికి ప్రొఫెసర్లను ఎంపిక చేసుకునే అధికారం కూడా.. ఎలాంటి అర్హత లేని ఈ క్యామ్ సైన్ సంస్థకే కట్టబెట్టేశారు. వారు ఆయన ఆదేశాలకు తగ్గట్టుగానే తతిమ్మా పర్వం నడిపించారు.

పీఎస్సార్ కోరుకున్నట్టుగా.. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే, కొంచెం అటు ఇటుగా మార్చి మాన్యువల్ పద్ధతిలోనూ వచ్చినట్టుగా నమోదుచేసి మమ అనిపించారు. అయితే  ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి పీఎస్సార్ ఆంజనేయులు ఇన్ని రకాల మతలబులు చేశాడు? తన కిందిస్థాయి అధికారుల్ని సిబ్బందిని అందరినీ బెదిరిస్తూ వారితో పనులు చేయించాడు అనేది తెలియడం లేదు.
ఏపీపీఎస్సీ అక్రమాల మీద కూడా కేసు నమోదు కావడంతో.. పోలీసులు పీటీ అప్పటి అక్రమాలపై పూర్తిస్థాయి దృష్టి సారించి వివరాలు సేకరిస్తున్నారు. పీటీ వారెంటు ద్వారా.. పీఎస్సార్ ఆంజనేయులునుకూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అక్రమాలకు వెనుక ఉన్న బడాదొంగలు ఎవరు? అనేది తేలుతుందని పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories