పీఎస్సార్ : రెండు ఉచ్చులూ బలంగానే చుట్టుకుంటున్నాయ్!

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ఆయన అండ చూసుకుని అడ్డగోలుగా రెచ్చిపోయిన అధికారుల్లో అందరికంటె పీఎస్సార్ ఆంజనేయులుదే పెద్ద పాత్ర ఏమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆయన మీద నమోదు అయిన కేసులు.. ఆయన మెడకు గట్టిగానే చుట్టుకుంటున్నాయి. ముంబాయి నటి కాదంబరి జత్వానీని అరెస్టులతో వేధించిన కేసులో ఆయనకు తాజాగా బెయిలు ను మహిళా సెషన్స్ కోర్టు నిరాకరించింది. మరొకవైపు.. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో పాల్పడిన అక్రమాల చిట్టా మరింత పెద్దదిగా తయారవుతోంది.

ముంబాయి నటి కాదంబరి జత్వానీని అరెస్టు చేయించిన కేసులో కీలక నిందితుడిగా పీఎస్సార్ ఆంజనేయులు రిమాండులో ఉన్నారు. ఈ విషయంలో నిందితులు అయిన ఇతర పోలీసు అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ తదితరులందరూ.. పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశాల మేరకే పనిచేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. నిజానికి వారందరికీ హైకోర్టు నుంచి కాస్త ఊరట కూడా లభించింది. అసలు తనను వారిని ఈ విషయంలో పురమాయించలేదని, అసలు కాదంబరి జత్వానీ ఎవరో తనకు మొన్న మొన్నటి వరకు తెలియదని, ఇటీవల వార్తల్లో చూసి ఆమె గురించి తెలుసుకున్నానని, ఆమె మీద సదభిప్రాయం కూడా కలగలేదని, పీఎస్సార్ ఆంజనేయులు పోలీసుల విచారణలో రకరకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారుగానీ.. ఆయన మాటలకు పెద్దగా మన్నన దక్కలేదు. కాదంబరి జత్వానీ కేసులో తాజాగా ఆయన బెయిలు దరఖాస్తును మహిళా సెషన్స్ కోర్టు నిరాకరించింది.

ఒకవైపు ఈ కేసు గట్టిగా సాగుతుండగా.. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న రోజుల్లో ఆయన పాల్పడిన అక్రమాలు మరింతగా బయటకు వస్తున్నాయి. క్యామ్ సైన్ మీడియా ద్వారా మూల్యాంకనం చేయించడంలో కేవలం ఆర్థిక అవినీతికి పాల్పడడం మాత్రమే కాదు.. అసలు మూల్యాంకనంలోనే అత్యంత ఘోరంగా వ్యవహరించినట్టుగా, నిబంధనలు అన్నీ తుంగలో తొక్కి తనకు నచ్చినట్టు చేయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చివరికి ఓ అధికారి కారు డ్రైవరు భార్యతో కూడా మూల్యాంకనం చేయించినట్టుగా విచారణలో తేలింది. వారందరి వాంగ్మూలాలను కూడా ఆల్రెడీ పోలీసులు సేకరించారు. ఈ కేసులో క్యామ్ సైన్ డైరక్టరు పమిడికాల్వ మధుసూదన్ కూడా ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. ఆయన విచారణ సందర్భంగా.. తనకు వచ్చే ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ రద్దు చేయిస్తానని బెదిరించడం వల్లనే.. మూల్యాంకనం వర్క్ ను తీసుకోవడానికి అంగీకరించినట్టు పోలీసులకు చెప్పారు. కేవలం పీఎస్సార్ ఒత్తిడి, బెదిరింపుల వల్లనే.. నిబంధనలకు విరుద్ధం అని తెలిసినప్పటికీ కూడా.. ఆ పనులు చేయించినట్లు ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

మొత్తానికి అటు కాదంబరి జత్వానీని అరెస్టు చేయించడానికి గానీ, అడ్డదారుల్లో గ్రూప్ 1 మూల్యాకంనం పూర్తి చేయించడానికి గానీ.. బెదిరింపుల అస్త్రాన్నే పీఎస్సార్ ఆంజనేయులు ప్రయోగించి.. తనకు కావాల్సిన విధంగా పనులు జరిపించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories